Test review: కొత్త కాన్సెప్ట్ ‘టెస్ట్’ చేశారు కానీ..!

by | Apr 5, 2025 | టీవీ & ఓటిటి

విడుదల తేది: 04–04–2025
నటీనటులు: మాధవన్‌, నయనతార, సిద్ధార్థ్‌, మీరా జాస్మిన్‌, కాళీ వెంకట్‌, నాజర్‌ తదితరులు.

కెమెరా: విరాజ్ సింగ్ గోహిల్
ఎడిటర్: టి.ఎస్.సురేష్
సంగీతం: శక్తిశ్రీ గోపాలన్
నిర్మాణ సంస్థ: వైనాట్‌ స్టూడియోస్‌
నిర్మాత: ఎస్‌.శశికాంత్‌, చక్రవర్తి, రామచంద్ర
దర్శకత్వం: ఎస్.శశికాంత్
స్ట్రీమింగ్: నెట్‌ఫ్లిక్స్‌

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం ‘ది టెస్ట్‌’(The Test). వైనాట్‌ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్‌ (Siddharth) ముఖ్య పాత్రల్లో నటించారు. మీరా జాస్మిన్‌ కీలక పాత్రలో నటించగా.. ప్రముఖ నిర్మాత శశికాంత్‌ మొదటిసారిగా దర్శకుడిగా ఈ సినిమాను రూపొందించారు. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ‘కుముధ’ అనే పాత్రలో నయన్‌ కనిపించనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఏప్రిల్ 4వ తేదీ నుంచి నేరుగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ్‌,తెలుగు,హిందీ,కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రియుల్ని ఎలా మెప్పించింది ? నయనతార, మాధవన్, సిద్దార్ట్ ఏ మేరకు ఆకట్టుకున్నారు ? క్రికెట్ ను మతంలా భావించే అభిమానులు ఈ చిత్రాన్ని ఏ మేరకు ఆదరిస్తున్నారు ? వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.

కథ:

అర్జున్ వెంకట్రామన్ (సిద్ధార్థ్) భారత క్రికెట్ లో అగ్రశ్రేణి ఆటగాడిగా వెలుగొందుతుంటాడు. అయితే ఒక్కసారిగా ఫామ్ కొల్పివడంతో అతన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ రిటైర్ అవ్వాలని కోరుతుంది. అయితే క్రికెట్ ను ప్రాణంగా ఇష్టపడే అర్జున్ కొన్ని మ్యాచుల్లో వైఫల్యం చెందడం కారణంగా రిటైర్మెంట్ ప్రకటించడానికి అంగీకరించడు. అర్జున్ భార్య పద్మ (మీరాజాస్మిన్). వీరికి ఓ కొడుకు ఉంటాడు. అర్జున్ స్కూల్‌మేట్ అయిన కుముద (నయనతార ) ఒక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ సరోగసి ద్వారా బిడ్డను పొందాలనుకుంటుంది. కుముద భర్త శరవణన్ (ఆర్ మాధవన్) టాప్ సైంటిస్ట్ కావాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలా ఈ ముగ్గురు తమ కలలను ఎలాగైన సరే నెరవేర్చుకోవాలని అనుకుంటారు. కానీ ఊహించని రీతిలో వారి జీవితల్లోకి బెట్టింగ్ మాఫియా అడుగుపెడుతుంది. చెన్నైలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే టెస్ట్‌ మ్యాచ్‌ ఈ ముగ్గురి జీవితాలను ఊహించని మలుపులు తిప్పుతుందనేదే ఈ సినిమా కథాంశం.

విశ్లేషణ:

క్రికెట్ నేపథ్యంలో వెండితెర మీద విజయఢంకా మోగించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ డ్రామాగా టెస్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమాలో కథ చాలా బాగుంది. కానీ అనుకుని రీతిలో కథను తెరపై చూపించడంలో దర్శకుడు శశికాంత్‌ పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పొచ్చు. ఈ సినిమాలో శరణన్‌ (మాధవన్) పాత్ర మాత్రమే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఆయన తన పాత్రలో జీవించారు. ఇక క్రికెటర్ అర్జున్ గా సిద్ధార్థ్ ఒదిగిపోయాడు. ఆయన పాత్రను ఇంకాస్త హైలెట్‌ చేసి చూపించి ఉంటే బాగుండేది. సిద్దార్థ్ భార్యగా మీరాజాస్మిన్ పాత్ర మెప్పించింది. ఉన్నంతలో ఆకట్టుకుంది. ఇక కుముదగా నటించిన నయనతార (Nayanathara) మరోసారి తెరపై అదరగొట్టింది. ఇలాంటి పాత్రలు తాను మాత్రమే చేయగలనని మరోసారి నిరూపించింది. అర్జున్ కొడుకుగా నటించిన లిరిష్ రాహవ్ భావోద్వేగాలను పండించాడు. నాజర్ తన పాత్ర పరిధిమేర ఆకట్టుకున్నారు. ఇంతమంది పేరున్న నటీనటులు ఉన్నప్పటికీ దర్శకుడు ఆ పాత్రలను సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోయాడుస్పోర్ట్స్ డ్రామాలో (Sports Drama) ఉండాల్సిన ఎమోషన్స్, ఇంటెన్సిటీ ఈ సినిమాలో లోపించాయి. ఈ సినిమాలో మ్యాచ్ ఫిక్సింగ్ నేపథ్యంలో వచ్చే అత్యంత కీలకమైన సన్నివేశాలే తెరపై పండకపోవడంతో ఈ కథకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని చెప్పొచ్చు. ఇందులో ఒక్క సీన్ కూడా ప్రేక్షకులు గుర్తుంచుకునే విధంగా లేదు. మొదటి నుండి చివరి వరకూ కథనం ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టేలా నెమ్మదిగా సాగుతుంది. కానీ క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం అక్కట్టుకున్నాయి. విరాజ్ సింగ్ గోహిల్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. శక్తిశ్రీ గోపాలన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మీద ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. తెలుగు డబ్బింగ్ బాగుంది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
నయనతార, మాధవన్, సిద్దార్ నటన
క్లైమాక్స్ సీన్స్

మైనస్‌ పాయింట్స్‌:
కథనం
సాగదీతగా అనిపించే సన్నివేశాలు
దర్శకత్వం

రేటింగ్: 2.5/5