టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వచ్చిన మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘మ్యాడ్ స్క్వేర్’. 2023లో వచ్చిన సూపర్ హిట్ మూవీ మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కల్యాణ్‌శంకర్ దర్శకుడు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించారు. భారీ అంచనాల మధ్య మార్చి 28న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దుమ్మురేపుతోంది. ఈ నేపథ్యంలోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో రూ. 74 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిన ఈ సినిమా రూ. 100 కోట్ల మైలురాయి వైపు పరుగులు తీస్తుంది. ఈ నేపథ్యంలో ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్ నిర్వహించాలని చిత్ర బృందం యోచిస్తోంది. అభిమానుల మధ్య ఏప్రిల్ 4న హైద్రాబాద్ లోని శిల్పా కళా వేదికలో ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ సక్సెస్ మీట్ జరగనుండగా.. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ముఖ్య అతిథిగా రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ సతీమణి ప్రణతి తమ్ముడైన నార్నే నితిన్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ఈ క్రమంలోనే అంతకుముందు ‘మ్యాడ్’ సినిమా ట్రైలర్ ను ఎన్టీఆర్ లాంచ్ చేసి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి తన బావమరిది కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే.. ‘మ్యాడ్ స్క్వేర్ (Mad Square) సినిమాకు రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రధారులుగా అలరించారు. రెబ్బా మెనికా జాన్ స్పెషల్ సాంగ్‌లో మెప్పించింది. ప్రియాంక జవాల్కర్ ముఖ్య పాత్ర పోషించారు. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ, హారిక సంయుక్తంగా నిర్మించగా..ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

