‘మ్యాడ్ స్క్వేర్’ హీరోతో నిహారిక కొత్త మూవీ షురూ!

by | Apr 2, 2025 | సినిమా

టాలీవుడ్ లో మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. కొత్త డైరెక్టర్, కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు సాధించి టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ఎల్‌.ఎల్‌.పి పతాకంపై నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు తన నిర్మాణ సంస్థ నుంచి నిహారిక కొణిదెల తన రెండో చిత్రాన్ని ప్రకటించారు. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుండగా.. నిహారిక కొణిదెల ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగీత్ శోభన్ ఇప్పుడు హీరోగా నిహారిక నిర్మాణంలో సినిమాని ప్రకటించడంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.

ఈ సినిమా ద్వారా మానస శర్మ దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. అంతకుముందు మానస శర్మ దర్శకురాలిగా తెరకెక్కించిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘బెంచ్ లైఫ్’ అనే వెబ్ సిరీసులు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇందులో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ లో సంగీత్ శోభన్ (Sangeeth Sobhan) కీలక పాత్రలో నటించగా.. నిహారిక కొణిదెల నిర్మాతగా ఉన్నారు. ఆ వెబ్ సిరీస్ కోసం పనిచేసిన ఈ ముగ్గురు ఇప్పుడు ఈ సినిమా కోసం మరోసారి కలిసి పని చేయనున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ నిహారిక కొణిదెల (Niharika) ఈ సినిమా దర్శకురాలు, హీరోతో కలిసున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు నిహారిక ‘‘కొత్త ప్రాజెక్ట్. కొత్త కథ. సినిమాపై అదే ప్రేమ. తర్వాత ఏమి జరుగుతుందో వేచి ఉండండి. అయితే జానర్‌ని మీరు ఊహించగలరా?’’ అనే క్యాప్షన్ జత చేసింది. కాగా, వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత నిహారిక కొణిదెల ప్రకటించారు.