టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్, బ్యూటీ క్వీన్ శ్రీలీల హీరో, హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాబిన్హుడ్’. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించగా.. నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలకుగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాను రూపొందించారు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రాహకుడిగా ఉన్నారు. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఉగాది పండుగ కానుకగా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. అయితే ఈ సినిమాకు తొలి రోజు బాక్సఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. ఈ క్రమంలోనే రాబిన్హుడ్ సినిమా దేశవ్యాప్తంగా మొదటి రోజున రూ. 2.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ యూఎస్ మార్కెట్ లో మాత్రం సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకుంది. అక్కడ మొదటి రోజే లక్ష డాలర్స్ కి పైగా గ్రాస్ వసూళ్లని సాధించింది. మొత్తంగా ఈ సినిమా విడుదలైన మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.3.75 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో రాబిన్హుడ్ సినిమా మొదటి రోజు థియేటర్లలో ఆక్యుపెన్సీని పరిశీలిస్తే.. మార్నింగ్ షోలో 19.62%, మ్యాట్నీ షోలో 21.84%, ఫస్ట్ షోలో 16.62%, సెకండ్ షోలో 28.15% గా ఉంది. అయితే రాబిన్హుడ్ (Robinhood) మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28.7 కోట్లుగా ఉంది. కానీ ఓపెనింగ్ డే ఊహించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడం చిత్ర బృందాన్ని కలవరపెడుతోంది. అయితే వీకెండ్ రావడంతో పాటుగా వరుసగా ఉగాది, ఈద్ సెలవులు రావడంతో ఈ మూవీ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో నితిన్ – వెంకీ కుడుముల కాంబినేషన్లో వచ్చిన ‘భీష్మ’ పెద్ద హిట్ కొట్టగా, మళ్లీ వారిద్దరి కాంబోలో వచ్చిన రాబిన్ హుడ్ చిత్రం కూడా పర్వాలేదనిపించింది. ఇదిలాఉంటే.. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ పాటుగా ఓటీటీ రైట్స్ కూడా మంచి ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ‘జీ5’ ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకోగా.. ‘జీ తెలుగు’ (Zee Telugu) ఈ మూవీ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

