‘డీజే టిల్లు’కి ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?

by | Mar 29, 2025 | సినిమా

టాలీవుడ్ యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డ న‌టించిన‌ డీజే టిల్లు’ సినిమా బాక్సఫీస్ వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ మూవీ కూడా అదరగొట్టింది. డీజే టిల్లూ సినిమాతో హిట్‌ కొట్టి ఆ పేరుతోనే పాపులర్‌ అయ్యాడు హీరో సిద్ధూ జొన్న‌ల‌గడ్డ. ఉంగరాల జుట్టు, టిపికల్‌ స్టయిల్‌, ఊర మాస్‌ డైలాగులతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సిద్ధూ ‘డీజే టిల్లూ’ సినిమాతో హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు. టిల్లూ ఫ్రాంచైజీతోనే యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. సిద్ధూ కెరీర్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైన‌ర్‌గా వ‌చ్చిన డీజే టిల్లు సినిమా నిర్మాతలకు కోట్ల లాభాలు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాకు ముందుగా డీజే టిల్లు అనే టైటిల్ అనుకోలేదంట‌. ఈ చిత్రానికి ఏ టైటిల్ పెట్టాల‌నే దానిపై అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చ‌నే జ‌రిగిందట.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు మొదటగా వేరే టైటిల్ అనుకున్నట్లుగా తెలిపాడు. ఈ నేపథ్యంలో సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “డీజే టిల్లు సినిమా కారణంగానే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. నా కెరీర్ కు ఈ మూవీ టర్నింగ్ పాయింట్. నాకు నటుడిగా ఈ సినిమానే గుర్తింపు తీసుకొచ్చింది. అయితే డీజే టిల్లు చిత్రానికి మొదటగా మేము ‘నరుడి బ్రతుకు నటన’ అనే టైటిల్‌ అనుకున్నాం. కానీ అంతకంటే ముందుగానే ఆ టైటిల్‌ను మరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాంతో వారికి రూ.4 లక్షలు చెల్లించి మేము ఆ టైటిల్ ను మళ్లీ కొనుకున్నాం. అయితే నా స్నేహితులతో ఈ సినిమా కథతో పాటు టైటిల్ గురించి చర్చిస్తున్నప్పుడు టైటిల్‌ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు అని వారెవరూ వినలేదు. ఒకసారి దర్శకుడు త్రివిక్రమ్‌ గారికి మా సినిమా టైటిల్‌ గురించి చెప్పగా.. ఇదొక మిడిల్ క్లాస్ పర్సన్ లవ్ స్టొరీ అంతేనా అని ఆయన అన్నారు. దాంతో టైటిల్‌ కొత్తది పెట్టాలని ఆలోచించాం. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని హీరో పాత్ర పేరు (డీజే టిల్లు)నే టైటిల్‌గా ఫిక్స్ చేస్తే బాగుంటుందని అందే టైటిల్ గా రిజిస్టర్ చేయించాం అని హీరో సిద్ధూ జొన్నలగడ్డ చెప్పుకొచ్చారు.