‘ఘాజీ’ డైరెక్టర్‌తో మూవీ.. గోపీచంద్‌కు జోడీగా స్టార్ హీరోయిన్

by | Mar 27, 2025 | సినిమా

చిత్రసీమలో ‘ఐబీ 71’, ‘ఘాజీ’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంకల్ప్‌ రెడ్డి హీరో గోపీచంద్‌ కాంబోలో సినిమా తెరకెక్కనుంది. గోపిచంద్ కెరీర్ లో 33వ చిత్రంగా ఇది రానుండగా… శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీచంద్‌ కెరీర్‌లోనే ఇది విభిన్నమైన కథ అని వినికిడి. పిరియాడిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాను 7వ శతాబ్దానికి చెందిన ఓ ఆసక్తికరమైన చారిత్రక సంఘటన ఆధారంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో గోపీచంద్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో ఉన్న గోపీచంద్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో గోపీచంద్ జోడీ కట్టడం విశేషం. ఏప్రిల్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో హీరో గోపీచంద్‌కు జోడీగా హీరోయిన్‌గా రితికా నాయక్‌ ఎంపికైనట్లు తెలుస్తోంది.

తాజాగా గోపీచంద్‌-రితికా నాయక్‌ ఇద్దరిపై చిత్ర బృందం ఫొటోషూట్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో రితికా నాయక్‌ తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవల మొదలైన వరుణ్‌ తేజ్‌ 15 చిత్రంలో కూడా రితికా నాయక్‌నే హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ చిత్రానిక ‘కొరియన్‌ కనకరాజు’ అనే టైటిల్‌ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇలా వరుసగా రెండు సినిమాల్లో అవకాశం దక్కించుకోని సూపర్ ఫామ్ లోకి వచ్చింది రితికా నాయక్‌. కాగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమాకు పేరొందిన సాంకేతిక నిపుణులు పని చేయనున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో బాగమయ్యే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబోలో మూవీ రానుండడంతో గోపీచంద్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఇండస్ట్రీ హిట్ పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.