‘కోర్ట్’ సెన్సేషనల్ రికార్డ్.. నానికి ఇదే తొలిసారి

by | Mar 26, 2025 | సినిమా

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వ‌ర్సెస్ ఏ నోబ‌డీ అనేది ఉప‌శీర్షిక‌. ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ఇందులో శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్ర‌శాంతి త్రిపిరినేని నిర్మించారు. హోలీ కానుకగా మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్​తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. పెద్దగా కమర్షియల్ అంశాల్లేకుండా కంటెంట్ కి కట్టుబడి తీసిన ఈ చిత్రం నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొస్తోంది. మొదటి రోజు నుంచే సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే లాభాల్లోకి కూడా అడుగుపెట్టేసింది. యూఎస్ మార్కెట్​లోనూ కళ్లుచెదిరే వసూళ్లను నమోదు చేస్తోంది. వీక్ డేస్​లోనూ స్ట్రాంగ్ హోల్డ్​ను కనబరుస్తూ ప్రదర్శితమవుతోంది. అలా ఈ ‘కోర్ట్’ మూవీ తాజాగా యూఎస్​లో 1 మిలియన్ డాలర్స్​​ క్లబ్​ లో చేరింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్​గా అనౌన్స్ చేసింది.

ఈ క్రమంలోనే నాని నిర్మించిన చిత్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా కోర్ట్ (Court) అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకూ ఈ సినిమా విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా.. ఈ 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 53.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ సినిమా లాంగ్​రన్​లో మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో విడుదలైన చిన్న సినిమాల్లో అత్యంత లాభాలను తీసుకొచ్చిన మూవీగా కోర్ట్ నిలిచినట్లు తెలుస్తోంది. కేవలం రూ.11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 50 లక్షలు, శాటిలైట్ ద్వారా రూ. 2 కోట్లు వచ్చాయని సమాచారం.