‘ఆర్సీ 17’, ‘పుష్ప 3’ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by | Mar 25, 2025 | సినిమా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ టైటిల్‌ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2 ది రూల్‌’. పుష్ప పార్ట్ 1 సినిమాకి సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా టాలీవుడ్‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద అన్ని రికార్డుల‌ను బ్రేక్ చేసి ఇటీవల సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటివలే 100 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ. 1871 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే పుష్ప 2 సినిమాకు మరో సీక్వెల్‌గా పుష్ప -3 ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పుష్ప 3 ఎప్పుడుంటుందనే విషయాన్ని తాజాగా మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని వెల్లడించారు.

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. “దర్శకుడు సుకుమార్ ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తో ‘RC 17’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ అనౌన్స్ చేశాడు. ఆ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అది ముగిసిన తర్వాత అల్లు అర్జున్ తో ‘పుష్ప 3’ ప్రారంభిస్తాం. అందుకు దాదాపుగా రెండేళ్ల సమయం పడుతుంది. నా అంచనా ప్రకారం ‘పుష్ప 3’ మూవీ 2027లో ఉంటుంది. అప్పటివరకు ‘ఆర్సీ 17’ సినిమా కూడా విడుదలవుతుంది అని నిర్మాత నవీన్ యెర్నేని చెప్పుకొచ్చారు. కాగా, ‘పుష్ప’ (Puhspa) ఫ్రాంచైజీలో భాగంగా 2021లో ‘పుష్ప ది రైజ్‌’ తెరకెక్కింది. 2021 డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.350 కోట్లకు పైగా వసూలు చేసింది. అనంతరం దీనికి సీక్వెల్ గా పుష్ప-2 తెరకెక్కగా.. 2024 డిసెంబర్‌ 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1871 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. కాగా, పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ కు (Allu Arjun) జోడీగా రష్మిక మందన్నా నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్, అద్భుతమైన మ్యూజిక్‌ అందించిన ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, రావు రమేష్, జగపతి బాబు, అజయ్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. కాగా, ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.