ఓటీటీలోకి ‘మజాకా’.. స్ట్రీమింగ్ ఈ రోజు నుంచే

by | Mar 25, 2025 | సినిమా

టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్, రీతువర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కింది. ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజేశ్ దండా నిర్మించారు. రావు రమేశ్‌, మన్మథుడు ఫేమ్ అన్షు, హైపర్ ఆది, మురళీ శర్మ, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. శివరాత్రి కానుకగా ఈ ఫిబ్ర‌వ‌రి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందగా.. సందీప్‌ కిషన్‌, రావు రమేశ్‌ తండ్రీ కొడుకుల పాత్రల్లో అలరించారు. వీరికి జోడీగా రీతూ వర్మ, అన్షు నటించారు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అభిమానులను నిరాశపరిచింది. దింతో అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ సాధించలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మజాకా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 సంస్థ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ సోషల్ మీడియా మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. మార్చి 28వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని ఎక్స్ లో అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. వెంకటరమణ (రావు రమేశ్‌), కృష్ణ(సందీప్‌ కిషన్‌) తండ్రీ కొడుకులు. వెంకటరమణ ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. కృష్ణ బీటెక్ చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటాడు. ఇంట్లో ఆడదిక్కు లేకపోవడంత ఎలాగైనా త‌న కొడుక్కి వివాహం చేసి ఇంట్లోకి ఓ ఫ్యామిలీ ఫోటో తెచ్చుకోవాలని వెంక‌ట‌ర‌మ‌ణ అనుకుంటాడు. అయితే కృష్ణకి అమ్మాయిని ఇవ్వ‌డానికి ఇష్టపడరు. ఈ క్రమంలోనే కొందరు ముందుగా వెంక‌ట‌ర‌మ‌ణనే పెళ్లి చేసుకోమని ఆ తర్వాత ఈ స‌మ‌స్య‌లన్నీ తీరుతాయ‌ని చెప్తారు. ఇలాంటి తరుణంలోనే వెంట‌క‌ర‌మ‌ణ‌కి య‌శోద (అన్షు) తార‌స‌ప‌డుతుంది. దాంతో ఆమెతో పీకల్లోతు ప్రేమ‌లో మునిగిపోతాడు వెంకటరమణ. మరోవైపు కృష్ణ కూడా మీరా (రీతూవర్మ)తో ప్రేమలో పడతాడు. అయితే ఇంట్లోకి ఓ ఫ్యామిలీ ఫోటోను తీసుకు రావాలని వెంకట రమణ, కృష్ణ చేసే ప్రయత్నాలు ఏంటి? వెంకట రమణ ప్రేమను యశోద ఎలా ఒప్పుకుంది? ఆఖరికి తండ్రికొడుకుల ఆశపడినట్లు ఇంట్లోకి ఫ్యామిలీ ఫోటో వచ్చిందా రాలేదా ? అనేది మిగిలిన కథ.