మోస్ట్ అవైటెడ్ ‘ఓదెల 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

by | Mar 22, 2025 | సినిమా

టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్‌’కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ మూవీ తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని రూపొందించిన అశోక్‌ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హెబ్బా పటేల్‌, వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌, మధు క్రియేషన్స్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కాంతార ఫేం అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగియగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని చిత్ర బృందం ప్రకటించారు. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 17 న ‘ఓదేల 2’ ( Odela ) విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తమన్న పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటి నుంచే ఈ మూవీ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోందట చిత్రబృందం. అయితే ఏప్రిల్ మధ్యలో పెద్దగా భారీ సినిమాల రిలీజ్ లేకపోవడంతో ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశముంది.

కాగా, ‘ఓదెల 2’ (Odela) మూవీ టీజర్‌ను ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్‌ మేళాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దింతో మహాకుంభ్‌ మేళాలో టీజర్‌ రిలీజ్ చేసుకోనున్న మొదటి భారతీయ సినిమాగా ‘ఓదెల 2’ మూవీ అరుదైన ఘనత సాధించింది. మొదటి భాగాన్ని మించి ఉండేలా భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతికతో ఈ మూవీ తెరకెక్కించినట్లు టీజర్ తోనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో తమన్నా (Tamannah) నాగసాధు పాత్రలో నటిస్తోంది. ఈ రోల్ కోసం ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుందని ఈ సినిమాలో తమ్మన్నా పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.