5వ రోజు ‘కోర్ట్’ ఊచ‌కోత‌.. క‌లెక్షన్ల ప్ర‌వాహం ఆగ‌డం లేదుగా.!

by | Mar 19, 2025 | సినిమా

నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మాతగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వ‌ర్సెస్ ఏ నోబ‌డీ అనేది ఉప‌శీర్షిక‌. ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్ర‌శాంతి త్రిపిరినేని నిర్మించారు. హోలీ పండుగ కానుకగా మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్​ను దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కోర్టు సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 33.55 కోట్ల కలెక్షన్లు రాబట్టడం విశేషం. కేవలం రూ.11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సఫీస్ వద్ద మొదటిరోజు రూ. 8.10 కోట్ల వసూళ్లు రాగా, రెండో రోజు రూ. 7.80 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక మూడోరోజు ఆదివారం ఏకంగా రూ. 8.50 కోట్లు కలెక్షన్స్‌ వసూలు చేసింది.

అలాగే నాలుగో రోజు, ఐదో రోజు వర్కింగ్ డేస్ అయినప్పటికీ ఈ మూవీ నాలుగో రోజున రూ. 4.50 కోట్లు అలాగే ఐదో రోజున రూ. 5.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక్కడే కాకుండా ఓవర్సీస్​లోనూ కోర్ట్ (Court) మూవీ ఆదరగొడుతుంది.ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తుండడం విశేషం. తాజాగా ఈ మూవీ యూఎస్ లో 8 లక్షల డాలర్స్ మార్క్ ని దాటేసింది. ప్రతీ రోజు కూడా దాదాపు లక్ష డాలర్స్ మేర ఈ చిత్రం సాధించడం విశేషం. ఇక ఇదే జోరు కొనసాగితే 1 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ ఈ మూవీకి వచ్చే అవకాశముంది. కాగా, కోర్ట్ మూవీకి ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 50 లక్షలు, శాటిలైట్ ద్వారా రూ. 2 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. ఈ వీకెండ్ నాటికి కోర్ట్ మూవీ రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇందులో శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించగా.. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు.