నాని ‘ది ప్యారడైజ్’లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్!

by | Mar 16, 2025 | సినిమా

బాలీవుడ్‌ కథానాయికలు కొన్నేళ్లుగా టాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. హిందీ స్టార్‌ హీరోయిన్లు తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కల్కి సినిమాతో దీపికా పదుకొణె, దేవరతో జాన్వీ కపూర్‌, లైగర్‌తో అనన్య పాండే టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఇటీవల సోనాక్షి సిన్హా కూడా తెలుగు తెరకు పరిచయమైంది. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇటీవలే జటాధర చిత్రబృందం సోనాక్షి ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. అయితే, తాజాగా సోనాక్షి సిన్హా మరో తెలుగు సినిమాలో కూడా నటించబోతునట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), దసరా మూవీ ఫేం శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. అంతకుముందు నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషనల్‌లో వచ్చిన ‘దసరా’ చిత్రం పలు అవార్డులను అందుకోవడంతో ఇప్పుడు రాబోతోన్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఏర్పడాయి. అయితే, ‘ది పారడైజ్’లో ఓ కీలక పాత్ర కోసం సోనాక్షి సిన్హాను చిత్ర బృందం సంప్రదించగా.. కథలో తన పాత్రను డిజైన్ చేసిన తీరు నచ్చడంతో వెంటనే సోనాక్షి సిన్హా కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో సోనాక్షి సరికొత్త పాత్రలో మెస్మరైస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీలో సోనాక్షి సిన్హా పై ఓ స్పెషల్ సాంగ్ ను కూడా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

కాగా, అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాలో సోనాలి కులకర్ణి కీలక పాత్రలో కనిపించనున్నారు. సికింద్రాబాద్ బ్యాగ్డ్రాప్ లో జరిగే కథగా శ్రీకాంత్‌ ఓదెల ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇటీవల గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక ‘ది ప్యారడైజ్’ (The Paradise) మూవీ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుండగా.. రెండో పార్ట్ ఆ తర్వాత విడుదల అవుతుందని సమాచారం. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్‌ వంటి 8 భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.