ఓటీటీలోకి ‘కోర్ట్‌’, ‘దిల్‌రూబా’ సినిమాలు.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

by | Mar 14, 2025 | టీవీ & ఓటిటి

తెలుగు చిత్రసీమలో మార్చి 14న హోలి పండగ కానుకగా ‘కోర్ట్‌’, ‘దిల్‌రూబా’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాని సమర్పణలో రూపొందిన ‘కోర్ట్‌’ సినిమాలో ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్ర‌శాంతి త్రిపిరినేని నిర్మించారు. శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు. ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్‌ టాక్‌ రావడంతో బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక కోర్ట్ మూవీ డిజిటల్‌ రైట్స్ ను విడుదలకు ముందే ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమా నాలుగు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్నాక ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా మేకర్స్ ఒప్పందం చేసుకున్నారు.

అలాగే, టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం, బ్యూటీ క్వీన్ రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘దిల్‌ రూబా’. ఫుల్ లెంగ్త్ లవ్‌ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వ కరుణ్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మాతలుగా ఉన్నారు. సామ్‌ సీఎస్‌ సంగీతం అందించిన.. ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాకు బాక్సఫీస్ వద్ద మొదటి రోజు కాస్త మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా పుంజుకుంటుంది అని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక ఆహా మంచి ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత దిల్‌రూబా ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.