బాలీవుడ్ యువ కథానాయకుడు విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ మూవీ బాక్సఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఛత్రపతి శివాజీ (Chatrapathi Shivaji) మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజై ఇండస్ట్రీ హిట్ గా నిలువడమే కాకుండా.. రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఛావా సినిమా తెలుగు వర్షన్‌ను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై మార్చి 7న విడుదల చేయగా.. మొదటిరోజే ఈ సినిమా ఏకంగా రూ.3 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే, రెండో రోజు కూడా ‘ఛావా'(Chava) సత్తాచాటింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రెండు రోజులకు గాను బాక్సాఫీస్ వద్ద రూ. 6.81 కోట్ల వసూల్లు సాధించినట్లు మేకర్స్ పేర్కొన్నారు. మూడో రోజు వీకెండ్ ఆదివారం రావడంతో ఈ మూవీ రూ. 10 కోట్ల మైలురాయిని దాటుతుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాగా, ఈ సినిమాలో రష్మిక (Rashmika) మందన్నా కథానాయికగా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. మహరాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్(Shambhaji Maharaj) జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. విక్కీ కౌశల్ ఇందులో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయన భార్య యెసుబాయ్ పాత్రను రష్మిక మందన్నా పోషించారు. ఇక శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2′(Stree 2) తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మొఘల్ రాకుమారి పాత్రలో డయానా పింటీ, ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించగా.. ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించారు.

