తెలుగు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ (Venkatesh) నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’.ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దాంతో హీరో వెంకటేష్ కెరీర్లో కలెక్షన్ల పరంగా అతి పెద్ద సినిమాగా అవతరించింది. ఇందులో వెంకటేష్ నటనకు, కామెడీ టైమింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. వారి ఈలలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది.
ఈ నేపథ్యంలో వెంకటేష్ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ స్క్రిప్ట్స్ వింటున్నారని తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం సీనియర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surendar Reddy) దర్శకత్వంలో వెంకటేష్ తన నెక్స్ట్ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వెంకీని కలిసిన సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ వినిపించగా.. కథతో పాటుగా తన రోల్ డిజైన్ చేసిన తీరుకు ఫిదా అయిన వెంకీ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంకటేష్ తో సినిమా కోసం సురేందర్ రెడ్డి వినోదాత్మకంగ సాగే ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు చోటుంటుందని సమాచారం. కాగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధృవ, రేసుగుర్రం, కిక్, ఊసరవెల్లి వంటి చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని తెలుస్తున్నది. ఇక మరోవైపు వెంకటేష్ (Venkatesh) నటించిన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్ రెండో సీజన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

