సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళిల (Rajamouli) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటిస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో మహేశ్ బాబు పేరు ‘రుద్ర’(Rudra) అని తెలుస్తోంది. మహేశ్ కెరీర్‌లోనే విభిన్నమైన పాత్రగా ‘రుద్ర’ నిలుస్తుందని ఇన్‌సైడ్ టాక్. మహేశ్ బాబును ‘రుద్ర’గా అత్యంత శక్తివంతమైన పాత్రలో ఆవిష్కరిస్తూ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
కాగా, ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో ముగిసింది. మొదటి షెడ్యూల్ పూర్తవడంతో రెండో షెడ్యూల్ కోసం చిత్రబృందం ఆఫ్రికాకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆఫ్రికాకి కాకుండా వెళ్లేందుకు ముందు ఒడిశాలోని అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరపనున్నట్లు సమాచారం. ఒడిశాలోని కోరాపుట్ అటవీ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇందులో కీలక పాత్ర పోషించబోతున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఓడిశాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి అడవుల్లో రెండో షెడ్యూల్ మొదలవుతుందని, అక్కడ మహేశ్ బాబు(Mahesh Babu) , పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటుగా ఇతర తారాగణం మీద కొన్ని కీలక యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించబోతున్నారని సమాచారం. కాగా, అమెజాన్ (Amazon) అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఇంకా హాలీవుడ్‌కి చెందిన పలువురు నటులు భాగం కానున్నారు.

