‘అది దా సర్‌ప్రైజు’ వచ్చేస్తుంది అంటున్న ‘రాబిన్‌హుడ్‌’

by | Mar 7, 2025 | సినిమా

టాలీవుడ్ యువ హీరో నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‌’(Robinhood). బ్యూటీ క్వీన్ శ్రీలీల (Sree Leela) కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) సంస్థ నిర్మిస్తోంది. నవీన్‌ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలుకుగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భీష్మ మూవీ త‌ర్వాత నితిన్(Nitin) – వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో ఈ సినిమా వ‌స్తుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. నితిన్ ఇందులో రాబిన్ హుడ్ (Robinhood) అనే దొంగ పాత్ర‌లో నటిస్తున్నాడు. అలాగే రాజేంద్రప్రసాద్‌ ఏజెంట్‌ జాన్ స్నో పాత్రలో కనిపించబోతుండగా.. ఇప్పటికే షేర్ చేసిన లుక్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇప్ప‌టికే మువీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు చిత్రబృందం సిద్ధమయ్యారు. ఈ సినిమాలోని ‘అది దా సర్‌ప్రైజు’ అంటూ సాగే మాస్ మసాలా సాంగ్‌ను మార్చి 10న సోమవారం రోజు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. నితిన్ మాస్ స్టెప్పులు కేతిక శర్మ గ్లామర్ షోతో రానున్న ఈ స్పెషల్ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటుందని మేకర్స్ అంటున్నారు. కాగా, ‘రాబిన్‌హుడ్‌’ సినిమా మార్చి 28న విడుదల కానుండగా.. ఇందులో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) కీలక పాత్ర పోషిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.