భారత సినీ పరిశ్రమలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది నయనతార. ఒక వైపు గ్లామరస్ పాత్రలు చేస్తూ.. మరోవైపు కథా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ లేడీ సూపర్ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక దక్షిణాదిలో కొన్నేళ్లుగా నటి నయనతారనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయకిగా పేరుగాంచరన్న సంగతి తెలిసిందే. ఈమె బాలీవుడ్ చిత్రం జవాన్ కోసం రూ. 12 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. తన అందం అభినయంతో అభిమానుల్ని ఆకట్టుకుంటున్న నయనతారని ఫ్యాన్స్ ముద్దుగా లేడీ సూపర్‌స్టార్ అని పిలుస్తుంటారు. అయితే ఇకపై లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ తో తనను పిలవద్దని నయనతార తాజాగా ప్రెస్ నోట్ విడుదల చేసింది.
నయనతార తన ప్రెస్ నోట్ లో ఇలా రాసుకొచ్చింది. “అందరికీ నమస్కారం, అభిమానులు ఎంతో ప్రేమగా నన్ను లేడీ సూపర్ స్టార్ అని పిలవడం నాకు సంతోషానిచ్చింది. కానీ ఆ ట్యాగ్ కంటే కూడా నయనతార అనే పేరే నా మనసుకు బాగా నచ్చింది. నా జీవితం తెరిచిన పుస్తకం. నా కష్టసుఖాల్లో మీరు అండగా నిలిచారు. ఇక మీద మీరు ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్ ట్యాగ్ తో కాకుండా నయనతార అని పిలిస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది. ఇలాంటి బిరుదుల వల్ల పలు కాంట్రవర్సీలు ఎదుర్కొన్నాను. నా ఆఖరి ఊపిరి వరకూ సినిమా కోసమే కష్టపడతాను. మీ అందరినీ అలరించడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను.” అని నయనతార రాసుకొచ్చింది.
ఇదిలాఉంటే.. నయనతార ప్రస్తుతం టెస్ట్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే నయనతార తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జోడీగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

