టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీనిధిశెట్టి, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. అయితే ఈ సినిమా తర్వాత సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ మూవీ ఫ్రాంచైజీ మూడో పార్ట్ ‘టిల్లు క్యూబ్’ (Tillu Qube) చేయనున్నట్లు సమాచారం. దీనికి కూడా సిద్ధునే స్క్రిప్ట్ అందించనున్నారు. దీంతో తొలి రెండు భాగాల కంటే ‘టిల్లు క్యూబ్’పై కూడా అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. కాగా, తాజాగా సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ తెలిసింది.
తాజాగా ఈ ‘టిల్లు క్యూబ్’ మూవీకి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాని డైరెక్ట్ చేసిన కళ్యాణ్ శంకర్ ‘టిల్లు క్యూబ్’ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తారని ఆయన వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్మ్స్ కూడా మరికొన్ని రోజులినే ప్రారంభిస్తామని నాగవంశీ ప్రకటించారు. కాగా, ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి గ్రాండ్ సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే ఈ సినిమాలను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మించారు.
ఇక 2022లో వచ్చిన టిల్లు తొలి భాగం డీజే టిల్లు సినిమాను విమల్ కృష్ణ తెరకెక్కించారు. ఆయనకు ఇదే తొలి సినిమా. అరంగేట్ర చిత్రంతోనే విమల్ సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ రెండింటికీ హీరో సిద్ధు జొన్నలగడ్డ సహ రచయితగా పని చేసిన సంగతి తెలిసిందే.

