విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందు లోహీరోయిన్ గా ‘ఓం భీమ్ బుష్’ ఫేమ్ ప్రీతి ముకుందన్ నటిస్తోంది. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతీ దేవిగా అలరించబోతున్నారు. అలానే మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, శరత్ కుమార్ , బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో రుద్ర పాత్రను పోషించారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ సైతం ఇటీవల విడుదలవగా.. అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే మహా శివరాత్రి సందర్భంగా’ కన్నప్ప’ మూవీ నుంచి ప్రభాస్ మరొక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ శివ భక్తుడిగా కనిపిస్తూ.. చేతిలో పొడవైన త్రిశూల దండాన్ని పట్టుకొని ఉన్నాడు. అలాగే పొడవాటి జులపాల జుట్టుతో, నుదిటిన విభూది పెట్టుకొని, మెడలో రుద్రాక్ష మాల ధరించి ఆధ్యాత్మిక లుక్ లో ప్రభాస్ అదిరిపోయేలా ఉన్నాడు. మొత్తంగా ‘కన్నప్ప’ మూవీలో రుద్రగా ప్రభాస్ అభిమానుల్ని సర్ప్రైజ్ చేసాడని చెప్పాలి. కాగా, పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.


