విడుదల తేది: 26–2–2025
నటీనటులు: సందీప్ కిషన్, రావు రమేశ్, రీతూవర్మ, అన్షు, శ్రీనివాస్ రెడ్డి, హైపర్ ఆది, రఘుబాబు మురళీ శర్మ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: నిజార్ షఫీ
సంగీతం: లియోన్ జేమ్స్
నిర్మాణ సంస్థ: ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, హాస్య మూవీస్ బ్యానర్స్
నిర్మాత: రాజేష్ దండ
స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సాయి కృష్ణ
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన
యంగ్ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan) , రీతువర్మ (Ritu Varma) జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’ (Majaka). ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రాజేశ్ దండా నిర్మించారు. రావు రమేశ్(Rao Ramesh) , మన్మథుడు ఫేమ్ అన్షు, హైపర్ ఆది, మురళీ శర్మ, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ సినిమాలో సందీప్ కిషన్, రావు రమేశ్ తండ్రీ కొడుకుల పాత్రల్లో అలరించనున్నారు. కొడుకు ఒక అమ్మాయితో ప్రేమలో ఉండగా.. తండ్రి మరో అమ్మాయితో ప్రేమలో పడటం అనేది ఆసక్తికరంగా ఉంది. వీరికి జోడీగా రీతూ వర్మ, అన్షు నటించారు. శివరాత్రి కానుకగా ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. సందీప్ కిషన్, రావు రమేశ్ తండ్రీ కొడుకులుగా ఆడియన్స్ ను ఎలా మెప్పించారు? రీతూ వర్మ, అన్షులతో వీరి ప్రేమ కథ ఎక్కడి వరకు వెళ్లింది
వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
వెంకటరమణ (రావు రమేశ్),
కృష్ణ(సందీప్ కిషన్) తండ్రీ కొడుకులు. వెంకటరమణ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. కృష్ణ బీటెక్ చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటాడు. ఇంట్లో ఆడదిక్కు లేకపోవడంత ఎలాగైనా తన కొడుక్కి వివాహం చేసి ఇంట్లోకి ఓ ఫ్యామిలీ ఫోటో తెచ్చుకోవాలని వెంకటరమణ అనుకుంటాడు. అయితే కృష్ణకి అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడరు. ఈ క్రమంలోనే కొందరు ముందుగా
వెంకటరమణనే పెళ్లి చేసుకోమని ఆ తర్వాత
ఈ సమస్యలన్నీ తీరుతాయని చెప్తారు. ఇలాంటి తరుణంలోనే వెంటకరమణకి యశోద (అన్షు) తారసపడుతుంది. దాంతో ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోతాడు వెంకటరమణ. మరోవైపు కృష్ణ కూడా మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతాడు. భార్గవ్ వర్మ (మురళీ కృష్ణ) తనకు ఎదురు తిరిగిన వాళ్లని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అలాంటి భార్గవ్ వర్మతో ఈ తండ్రీకొడుకులకు ఉన్న సంబంధం ఏంటి ? ఇంట్లోకి ఓ ఫ్యామిలీ ఫోటోను తీసుకు రావాలని ఈ వెంకట రమణ, కృష్ణ చేసే ప్రయత్నాలు ఏంటి? వెంకట రమణ ప్రేమను యశోద ఎలా ఒప్పుకుంది? ఆఖరికి తండ్రికొడుకుల ఆశపడినట్లు ఇంట్లోకి ఫ్యామిలీ ఫోటో వచ్చిందా రాలేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
నిజానికి ఈ సినిమాలో కథ, కథనం చాలా బాగున్నాయి. భార్య మరణించినా కొడుకు కోసం మరో పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయిన తండ్రి ఆఖరికి కొడుకు పెళ్లి కోసమే మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడం. తండ్రీ తనయులు ప్రేమకథలను సమాంతరంగా నడిపిస్తూ ఫస్ట్హాఫ్ను తెరకెక్కించాడు దర్శకుడు. ఒకరి ప్రేమకథ మరొకరికి తెలిసిపోవడం, ఆ తర్వాత వచ్చే బస్ స్టాప్, ప్రేమ కథల ఎపిసోడ్, భార్గవ్ వర్మ ఇబ్బంది పెట్టే సీన్స్తో సినిమా కడుపుబ్బా నవ్విస్తూ సాగిపోతుంది. ఆ తర్వాత వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్ మొదలయ్యే ముందు వచ్చే ట్వీస్ట్ కూడా సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ గా మారుస్తుంది. అయితే ఆ తర్వాత వచ్చే కథ, కథనం సాగదీతగా అనిపిస్తుంది. అనకాపల్లి పెళ్లి ఎపిసోడ్ కూడా అతికించినట్లు అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ లో కథని ముగించిన తీరు అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో తండ్రికొడుకులుగా రావు రమేశ్, సందీప్ కిషన్ తెరపై తమదైన శైలిలో మెప్పించారు. సినిమా మొత్తాన్ని వీరిద్దరే భుజస్కంధాలపై మోశారు. రీతూ వర్మ, అన్షులు తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. భార్గవ్ వర్మ పాత్రలో మురళీ శర్మ జీవించేశారు. హైపర్ ఆది, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబులు కడుపుబ్బా నవ్వించారు. లియోన్ జేమ్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. నిజర్ షఫీ సినిమాటోగ్రఫీ బాగుంది. చోటా కే ప్రసాద్ సెకండాఫ్ లో ఇంకొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ బాగున్నాయి. దర్శకుడు త్రినాధరావు నక్కిన తన మార్క్ ను చూపిస్తూ సినిమాను తెరకెక్కించినప్పటికీ కథ, కథనంను నడిపించే విషయంలో కాస్త తడపడ్డాడు అని చెప్పొచ్చు. ఈ సినిమా నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
కామెడీ
సెకండాఫ్ లో ట్విస్టులు
క్లైమాక్స్
సందీప్ కిషన్ ,రావు రమేష్, మురళీ శర్మ నటన.
మైనస్ పాయింట్స్:
రొటీన్ గా సాగే ఫస్టాఫ్
ఆసక్తి రేకెత్తించని కథ, కథనాలు
రేటింగ్: 2.75/5

