‘హిట్-3’ టీజర్‌ తేదీని ఫిక్స్‌ చేసిన నాని!

by | Feb 19, 2025 | సినిమా

నేచురల్ స్టార్ నాని (Nani) , యంగ్ డైరెక్టర్ శైలేశ్‌ కొలను కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘హిట్‌’: ది థర్డ్‌ కేస్‌’. క్రైమ్‌ థ్రిల్లర్​గా రూపొందనున్న ఈ చిత్రంలో అర్జున్‌ సర్కార్‌ అనే ఓ పవర్​ఫుల్ ఐపీఎస్‌ ఆఫీసర్​గా నాని కనిపించనున్నారు. ఇంతకుముందు యువ హీరోలు విష్వక్‌ సేన్‌ ‘హిట్‌’, అడివి శేష్‌ ‘హిట్‌ 2’లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో ‘హిట్​ 3’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా హిట్ 3 (HIT 3) సినిమా టీజర్ గురించి అధికారిక అప్ డేట్ వచ్చేసింది.

తాజా సమాచారం ప్రకారం ఈ ఫిబ్రవరి 24న హిట్ 3 మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు ఈ సినిమా యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అధికారికంగా ప్రకటించారు. అనేక సర్‌ప్రైజ్‌ల సమాహారంగా హై ఇంటెన్సిటీ సస్పెన్స్ సీక్వెన్స్‌తో టీజర్ ఆకట్టుకోనుందని చెబుతున్నారు. హిట్ మూవీ టీజర్ విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుండగా.. చిత్ర యూనిట్ ఇప్పటికే టీజర్ ఫైనల్‌ కట్‌, మ్యూజిక్ మిక్సింగ్‌లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. కాగా, వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇక అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా ఈ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.