సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శక ధీరుడు రాజమౌళిల కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే కావడం, ఆయన దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ హైప్ క్రియేట్ చేస్తున్నది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ నిర్మించే ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబు తన కెరీర్లో ఇప్పటి వరకు చూడని కొత్త లుక్‌తో కనిపిస్తారని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తోండగా.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.
అయితే రాజమౌళి ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో పెట్టిన ఓ నిబంధన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ సెట్స్ లో ప్లాస్టిక్ బాటిల్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహేశ్‌బాబుతో పాటుగా ప్రతి ఒక్కరు ఈ నిబంధనని కచ్చితంగా పాటించాలని జక్కన తేల్చిచెప్పారట. దింతో ఈ మూవీ నిర్మాణ సంస్థకు దాదాపుగా రూ. 2 కోట్లు ఆదా కానుందని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా రోజుకు వేల మంది వరకు ప్రొడక్షన్ సిబ్బంది, ఆర్టిస్టులు, మేకర్స్ పాల్గొంటున్నారట. వీరందరికీ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు అందించడం వలన అనవసరపు ఖర్చుతో పాటుగా పర్యావరణ కాలుష్యం అని భావించిన రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

