కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న లోక్ సభలో ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సంస్కరణలు, అభివృద్దే లక్ష్యంగా బడ్జెట్ ని తీర్చి దిద్దిన ఆర్ధిక మంత్రి ఉద్యోగులకు 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేకుండా ఊరటనిచ్చారు. ఇది నిజంగా టాక్స్ పేయర్స్ కు బిగ్ రిలీఫ్. కొన్ని కార్యక్రమాలు ఢిల్లీ, బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేసినట్లున్నప్పటికీ, సంస్కరణలు, సేవింగ్స్, దీర్ఘ కాలిక అభివృద్దే లక్ష్యం గా బడ్జెట్ ను రూపొందించారు
ఆంధ్ర ప్రదేశ్ కు కొన్ని తాయిలాలు ఎటు ఇచ్చారు, ఇస్తారు. ఈ మధ్యనే స్టీల్ ప్లాంట్ కు 11 వేల కోట్ల ను కూడా ప్రకటించారు. సవరించిన పోలవరం బడ్జెట్ కు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. బీజేపీ ఎటూ కూటమి ప్రభుత్వంలో భాగమే కాబట్టి ప్రత్యేకం గా ఏమి ప్రకటించనక్కర్లేదు. రానున్న రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వ సహకారం, పూర్తిగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.
అయితే తెలంగాణ కు పూర్తి గా అన్యాయం జరిగింది. అన్యాయం జరిగింది అనే కంటే తెలంగాణ ను పక్కన పెట్టారని చెప్పవచ్చు. బడ్జెట్ ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన మంత్రివర్గ సహచరులతో పార్టీ, ప్రభుత్వ ప్రస్తుత పరిస్థితులపైనా, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అనే అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కు చేసిన ప్రతిపాదనలు ఆమోదించలేదు సరి కదా, కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క పధకానికి, ప్రాజెక్ట్ కు కేంద్ర బడ్జెట్ లో చోటు కల్పించలేదు. దీనితో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా నిరాశకు లోనయ్యారు. దీనిపై ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తీవ్రంగా మండిపడుతున్నారు. నిరసనగా ధర్నాలు చేపడుతున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర సహచరులు అందరు బీజేపీ ని, ప్రధాన మంత్రి మోడీ పై అనవసర కామెంట్ లు గతం లో చేయడమే దీనికి ఒక కారణం కావచ్చు. నీకు నచ్చినా, నచ్చకపోయినా ప్రధాన మంత్రి స్థాయిని, వ్యక్తి ని గౌరవించాలి. సఖ్యతతో నిధులు రాబట్టుకోవాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గా విఫలమయ్యింది. ఇప్పటికే ఉచితాలతో ఖజానా ఖాళీ అవుతోంది. ఉచిత బస్సు ప్రయాణం తో రాష్ట్రానికి సుమారు 4000 కోట్ల రూపాయల ఖర్చు అవుతోంది.
కేంద్రం నుండి ఎలాంటి సాయం లేకపోవడంతో, ఆ మేరకు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పై 60 వేల కోట్ల అదనపు భారం పడనుంది. ఉచిత బస్సు ప్రయాణం, రైతు బంధు, రుణ మాఫీ పధకాలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, తెచ్చిన రుణాలపై వడ్డీ ఇవన్నీ ప్రస్తుతం ఉన్న నిధులతో సరిపెట్టుకోవాలి.
కొత్త గా ప్రకటించిన మెట్రో-2 దశ ప్రాజెక్ట్ కు కేంద్ర వంతు సాయంగా 17,212 కోట్ల రూపాయలకు కోరగా, అందులో ఒక్క రూపాయి రాలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ హైదరాబాద్ లో ఎక్కువ సీట్లు గెలుచులోకపోయింది. మరో ఆరు నెలల లో వర్ష కాలం వస్తుంది, ఈ లోగా, హైదరాబాద్ లో ఉన్న భూగర్భ డ్రైనేజీ సమస్యలను పరిష్కరిద్దామనుకుంటే, దానికి కావలసిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి రాలేదు. ఇప్పుడున్న పరిస్థితులలో మూసి ప్రక్షాళన, పునరుజ్జీవం మీద ఖర్చు పెట్టడానికి రాష్ట్ర ఖజానాలో నిధులు ఉన్నాయో లేదో కూడా తెలియదు. రాష్ట్రానికి ఐఐటీ, ఐఐఎం, నవోదయ పాఠశాలలు ఏమి ఇవ్వలేదు. కొత్త విమానాశ్రయాలు, సాగు నీటి ప్రాజెక్టులకు, రైల్వే లైన్ ల అనుసంధానానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేదు
దేశ జీడీపీ లో, తెలంగాణ రాష్ట్ర వాటా 4.5% ఉన్నా, పన్నుల రూపం లో 26 వేల కోట్ల రూప్యాలు కడుతున్నా, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపించింది..
హైదరాబాద్ ఉంది అని చెప్పుకుని దావోస్ పర్యటనలో లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుండి ఎలాంటి సహకారం లేకపోవడం వలన, రాష్ట్ర ఖజానాకు చిల్లు పడడమే కాకుండా, పరిశ్రమల కు కావలసిన మౌలిక సదుపాయాలు, రాయితీలు ఇవ్వలేని పక్షంలో పెట్టుబడి దారులు వస్తారో, రారో తెలియని పరిస్థితి.
మూడవ సారి నరేంద్ర మోదీ అధికారంలో కి వచ్చి 8 నెలలే అయ్యింది. ఇంకా నాలుగు సంవత్సరాల పాటు మోడీయే ప్రధాన మంత్రి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, అభివృద్ధిని ఎలా చేస్తారు అనేది తెలంగాణ ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సవాల్. BRS ప్రభుత్వంలో కరెంటు కోతలు అనేవి లేవు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కరెంటు కోతలు మొదలయ్యాయి. పూర్తి గా సమ్మర్ రాకముందే కరెంటు కోతలు మొదలయ్యాయి. సమ్మర్ వచ్చాక పరిస్థితి ఏంటి అని సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితిని BRS ఎంత వరకు ఉపయోగించుకుంటుందో చూడాలి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతే రెడ్డి ప్రసంగాలు వాడి, వేడిగా ఉంటాయి. అయితే పరిపాలన ఎంత వాడి, వేడిగా ఉంటుంది అనే విషయం ఇలాంటి సమయాలలోనే బయట పడుతుంది.

