అల్లు వారి పెళ్లి సంద‌డిలో ‘మెగా’ కపుల్‌

by | Feb 21, 2026 | సినిమా

అల్లు ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ చిన్న కుమారుడు హీరో శిరీష్‌, నయనిక మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. మార్చి 6న ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. శిరీష్‌ అన్నవదినలైన అల్లు అర్జున్‌- స్నేహల పెళ్లిరోజు కూడా ఇదే కావడం విశేషం. పత్రికల పంపిణీ ఇప్పటికే మొదలవ్వగా.. దుబాయ్‌లో ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ కూడా జరిగాయి. అయితే తమ్ముడి పెళ్లి సందర్భంగా అల్లు అర్జున్ హైద్రాబాద్ లో ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఓ స్పెషల్ గ్రూప్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అల్లు శిరీష్, అతనికి కాబోయే భార్య నయనిక, అల్లు అర్జున్ , ఆయన భార్య స్నేహారెడ్డి, అలాగే రామ్ చర‌ణ్‌, ఆయ‌న‌ భార్య ఉపాసన కలిసి కనిపించారు. రెండు కుటుంబాలకు చెందిన వారంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పార్టీకి వచ్చిన వారంతా బ్లాక్ డ్రెస్ కోడ్‌లో రావడం ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో మరో విశేషం ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చ‌రణ్‌ అయ్యప్ప మాల వేసుకొని కనిపించారు.

అంతకుముందు పెళ్లిపత్రికల పంపిణీలో భాగంగా మొదటి పత్రికను మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులకు అల్లు అరవింద్ దంపతులు అందించిన సంగతి తెలిసిందే. తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికను మా మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు అందించాం అంటూ ఫోటో షేర్‌ చేశాడు శిరీష్. కాగా, అల్లు శిరీష్‌- నయనిక స్నేహం మొదలైన కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. 2023లో వరుణ్‌తేజ్‌- లావణ్యల పెళ్లి సందర్భంగా హీరో నితిన్‌- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్‌ ఫ్రెండ్‌ నయనిక కూడా వచ్చింది. ఇటు వరుణ్‌ తేజ్ తరపున శిరీష్‌ పార్టీకి హాజరయ్యాడు. అక్కడే శిరీష్‌- నయనిక మనసులు కలిశాయి, ఆపై పెద్దలు కూడా వీరి ప్రేమకు అంగీకారం తెలపడంతో రెండేళ్ల ప్రేమ ఇప్పుడు మూడుముళ్ల బంధంగా మారనుంది.