చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో సీనియర్ హీరోయిన్ రాధికా శరత్‌కుమార్ ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నుంచి టాలీవుడ్ అగ్ర హీరోల వరకు నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్న రాధికా, హీరోయిన్గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా విభిన్న పాత్రల్లో మెప్పించారు. ప్రస్తుతం రాధికా శరత్ కుమార్ సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అటు తమిళ చిత్రాలతో పాటు, ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ, ఇతర భాషల్లోనూ అవకాశాలను అందుకుంటున్నారు. అయితే, తాజాగా సీనియర్ హీరోయిన్ సుహాసిని వ్యాఖ్యాతగా రాధిక శరత్ కుమార్ అతిథిగా ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఇందులో ఉత్తమ నటుడు ఎవరు అనే ప్రశ్నకు రాధిక శరత్ కుమార్ చెప్పిన సమాధానాలు సినీ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇద్దరిలో ఎవరు ఉత్తమ నటుడు అంటూ రాధికాను సుహాసిని ప్రశ్నించారు. అందుకు జవాబుగా మోహన్‌లాల్ పేరును రాధిక చెప్పారు. మోహన్‌లాల్ భారత సినీ రంగంలోనే అత్యుత్తమ నటుడు అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
ఆ తర్వాత మోహన్‌లాల్, కమల్ హాసన్‌లలో ఎవరు ఉత్తమ నటుడు మరోసారి సుహాసిని రాధికాను అడిగారు. దానికి సమాధానంగా వెంటనే కమల్ హాసన్ అంటూ జవాబిచ్చారు. ఆ తర్వాత కమల్ హాసన్, శరత్ కుమార్‌లలో ఎవరు ఉత్తమ నటుడు అని ప్రశ్నించగా మరోసారి కమల్ హసన్ కే రాధిక ఓటేశారు. అయితే చిరంజీవి కంటే మోహన్‌లాల్ ఉత్తమ నటుడు అని రాధిక శరత్ కుమార్ చెప్పడంతో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అయినా ఇద్దరు దిగ్గజ నటులను పట్టుకొని ఎవరు గొప్ప అని సుహాసిని ప్రశ్నించడం ఏంటో అర్థం కావడం లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే వారివారి ఇండస్ట్రీల్లో ఇద్దరూ గొప్పవాళ్లే అని చెప్పొచ్చు. తెలుగులో చిరంజీవి సాధించిన విజయాలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి. అలానే మలయాళంలో మోహన్ లాల్ సాధించిన ఘనతలు చిరస్మరణీయం. ఏదేమైనా చిరంజీవి, మోహన్ లాల్ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి పరస్పరం ఉన్న స్నేహం, అభిమానం, గౌరవం ఎప్పుడూ ప్రత్యేకమే అని చెప్పొచ్చు. ఇది ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. మోహన్ లాల్‌ని ముద్దుగా లాల్ అంటూ చిరు పలకరిస్తే, చిరంజీవిని మై డియర్ చిరు అంటూ మోహన్ లాల్ పిలుస్తుంటారు.
https://www.instagram.com/reel/DU5D_nGD0Xu/?utm_source=ig_web_copy_link


