తెలుగు చిత్ర సీమను సెన్సార్ సమస్యలు వేదిస్తున్నాయి. కొన్ని సినిమాలకు ఎందుకు యు/ఎ సర్టిఫికెట్ ఇస్తున్నారో తెలియట్లేదు, అలాగే మరికొన్ని సినిమాలకు ఎందుకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ముఖ్యంగా కొన్ని చిత్రాల టైటిల్స్ ఎందుకు మార్చమంటారో కూడా అంతుచిక్కడం లేదు. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. వీటిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. గత రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా నాలుగు తెలుగు చిత్రాల టైటిల్స్ విషయంలో సెన్సార్ బోర్డ్ ముప్పుతిప్పలు పెట్టేసింది. డిసెంబర్ నెల చివర్లో విడుదల కావాల్సిన ‘వానర’ మూవీ టైటిల్ మీద సెన్సార్ వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చిత్రబృందం సినిమా టైటిల్ ను ‘వనవీర’ అని మార్చుకున్నారు. దీంతో అప్పటివరకు చేసిన ప్రమోషన్స్ అంతా వృథా అవగా డిసెంబర్ 26న రావాల్సిన సినిమా జనవరి 1న విడుదలైంది. గత వారం విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ మూవీ టైటిల్ని ‘ఫ్రెండ్లీ కపుల్’ అని మారిస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని సూచించినా మేకర్స్ ఇందుకు అంగీకరించలేదని, దాంతో సెన్సార్ బోర్డ్ మూవీకి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారని నిర్మాతలే చెప్పారు. అలాగే ‘చాయ్ వాలా’ సినిమా టైటిల్ మీద కూడా సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దాంతో తమ సినిమా పేరును ‘చాయ్ వాలా’ నుండి ‘నవాబ్ కేఫ్’ గా మార్చుకున్నామని నిర్మాతలు తెలిపారు. ఇక ఈ వీకెండ్ లో విడుదల కావాల్సి సుహాస్ నటించిన ‘హే భగవాన్’ సినిమాకు కూడా ఇప్పుడు టైటిల్ మార్చేశారు. ఈ సినిమా పేరును మార్చాల్సిందిగా సెన్సార్ అధికారులు సూచించడంతో ఇప్పుడు ‘హే బలవంత్’ అని మార్చారు. అయితే ఈ నాలుగు సినిమాల టైటిల్స్లోనూ అసభ్యకర పదజాలాలు వాడలేదు. ఈ టైటిల్స్ మీద ఎవరూ కూడా పిర్యాదు చేయలేదు. అయినా కూడా సెన్సార్ బోర్డ్ ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతుంది అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

