ఆసీస్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. 2007 తర్వాత ఇదే తొలిసారి!

by | Feb 13, 2026 | క్రీడలు

T 20 World Cup : టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియాకు పసికూన జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా 23 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన జింబాబ్వే ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్‌ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగులు సాధించింది. జింబాబ్వే జట్టులో ఓపెనర్ బ్రియాన్‌ బెనెట్‌ 56 బంతుల్లో 64 పరుగులు సాధించి అజేయ అర్ధ శకతంతో చెలరేగగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ తాడివనాషే మరుమణి 21 బంతుల్లో 35 పరుగులతో మూడో స్థానంలో వచ్చిన ర్యాన్‌ బర్ల్‌ 3 బంతుల్లో 35 పరుగులు చేసి రాణించారు. చివర్లో కెప్టెన్‌ సికందర్‌ రజా 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 25 పరుగులతో చెలరేగాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మార్కస్‌ స్టొయినిస్‌, కామెరాన్‌ గ్రీన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు జింబాబ్వే బౌలర్లు ఆదిలోనే కొలుకోలేని దెబ్బ కొట్టారు. 8 పరుగులు చేసిన జోష్‌ ఇంగ్లిస్‌ను బ్లెసింగ్‌ ముజర్‌బానీ ఔట్ చేయగా.. 17 పరుగులు చేసిన ట్రవిస్‌ హెడ్‌ను బ్రాడ్‌ ఎవాన్స్‌ పెవిలియన్ కు చేర్చాడు. ఇక మూడో స్థానంలో వచ్చిన గ్రీన్‌ను ఎవాన్స్‌ డకౌట్‌ చేయగా.. టిమ్‌ డేవిడ్‌ను కూడా ముజర్‌బానీ డకౌట్ గా పెవిలియన్ పంపాడు. అయితే ఆసీస్ ఇన్నింగ్స్ లో మాట్ రెన్‌షా 65, మ్యాక్స్‌వెల్ 31 పరుగులు చేసి రాణించారు. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ముజర్‌బానీ బౌలింగ్‌లో ఫామ్ లో ఉన్న రెన్‌షా ఔట్ కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే ఓవర్లో చివరి బంతికి ముజర్‌బానీ ఆడం జంపాను కూడా ఔట్ చేశాడు ఎం దీంతో ఆస్ట్రేలియా విజయానికి 6 బంతుల్లో 29 పరుగులు కావాల్సి వచ్చింది. ఇక చివరి ఓవర్లో ఎవాన్స్‌ బౌలింగ్‌లో తొలి బంతికే నాథన్‌ ఎల్లిస్‌ ఫోర్‌ కొట్టాడు. కానీ ఆ తర్వాత ఎవాన్స్‌ మూడో బంతికి మాథ్యూ కుహ్నెమన్‌ రనౌట్‌ చేయడంతో ఆస్ట్రేలియా పదో వికెట్‌ కోల్పోయింది. జింబాబ్వే విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో 19.3 ఓవర్లలో కేవలం 146 పరుగులే చేసి ఆలౌట్‌ అయింది. దాంతో జింబాబ్వే 23 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. జింబాబ్వే బౌలర్లలో ముజర్‌బానీ నాలుగు వికెట్లు, ఎవాన్స్‌ మూడు వికెట్లు పడగొట్టారు. అయితే టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో మొదటి ఎడిషన్‌ 2007లో ఆస్ట్రేలియాను తొలిసారి ఓడించిన జింబాబ్వే మళ్లీ ఇన్నేళ్లకు ఆస్ట్రేలియాపై గెలుపొందడం విశేషం. ఇక మరోవైపుఆసీస్‌ను చిత్తు చేసిన ఆనందంలో ఉన్న జింబాబ్వేకు భారీ షాక్‌ తగిలింది. వికెట్‌కీపర్-బ్యాటర్‌ బ్రెండన్ టేలర్ హామ్‌స్ట్రింగ్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ టోర్నీలో జింబాబ్వే ఆడిన తొలి మ్యాచ్‌లో టేలర్‌ గాయపడ్డాడు. ఒమన్ తో జరిగిన మ్యాచ్‌లో అతను మూడు అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంతో పాటు 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌ చేస్తుండగా టేలర్‌ కుడి కాలికి గాయంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో టేలర్‌ మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది.