విడుదల తేది: 06–02–2026
నటీనటులు: అమర్దీప్ చౌదరి (Amar Deep Chowdary), శైలి చౌదరి , జేడీవీ ప్రసాద్, టేస్టీ తేజ (Tasty Teja), కరన్ విజయ్, మిర్చీ కిరణ్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: హలేష్ ఎస్
సంగీతం: సుభాష్ ఆనంద్
ఎడిటర్: నాహిద్ ఎం
నిర్మాణ సంస్థ: Vision Movie Makers
నిర్మాతలు: కొమ్మలపాటి సాయి సుధాకర్ (Sai Sudhakar)
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎం.ఎం.నాయుడు (M M Naidu)
బిగ్‌బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి (Amardeep Chowdary( హీరోగా శైలి కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’.(Sumathi Shathakam) ఎం.ఎం.నాయుడు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఉభయ తెలుగు రాష్ర్టాల్లో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. టేస్జీ తేజ, మహేష్ విట్ట, జేడీవీ ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సుభాష్ ఆనంద్ అందించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘సుమతీ శతకం’ చిత్రాన్ని ఫిబ్రవరి 06న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది అనేది ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
తూర్పుగోదావరి జిల్లాలోని వైకుంఠపురం గ్రామంలో ఉండే కృష్ణ (అమర్దీప్ చౌదరి) చిన్ననాటి నుంచే వివాహం మీద చాలా ఇష్టం పెంచుకుంటాడు. పెళ్లి వయసు వచ్చాక మాత్రం ఏ సంబంధం కుదరదు. ఊళ్ళో జరిగే ప్రతీ పెళ్లికి వెళ్లి నాకు పెళ్లి చేయండి అంటూ గోల చేస్తుంటాడు. అలాంటి సమయంలోనే అంగన్వాడీ టీచర్ సుమతి (శైలి చౌదరి) పరిచయమవుతుంది. తొలిచుపులోనే ఆమెపై మనసు పారేసుకున్న కృష్ణ, సుమతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే కొన్ని రోజులకు ఆ అమ్మాయి కూడా కృష్ణని ఇష్టపడుతుంది. ఈ క్రమంలోనే ఓ రోజు తన ప్రేమ గురించి కృష్ణ ఆమెకు తెలపగా.. శుక్రవారం గుడికి రమ్మని ఆమె కృష్ణకి చెబుతుంది. అయితే ఇంతలో సుమతి గురించి ఓ ఊహించని విషయం కృష్ణకి తెలుస్తుంది. అది తెలుయగానే సుమతిపైన ఉన్న ప్రేమ కాస్తా భయంగా మారుతుంది. అసలు కృష్ణకు ఏం తెలిసింది ? తనలోని ప్రేమ భయంగా మారడానికి కారణమేంటి? తన పెళ్లి కాస్తా, ఊరి సమస్యగా ఎందుకు మారుతుంది ? చివరికి కృష్ణ, సుమతి ఒక్కటయ్యారా అనేదే ‘సుమతీ శతకం’ సినిమా మిగతా కథ.
విశ్లేషణ:
హీరో అమర్దీప్ కృష్ణ పాత్రలో
చక్కటి జోష్‌తో అద్భుతంగా నటించాడు. తెరపై చాలా చురుగ్గా కనిపించాడు. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా డ్యాన్స్‌లు, ఫైట్స్, డైలాగ్ డెలివరీలో తన మార్క్ చూపించాడు. హీరోయిన్గా శైలి తన నటనతో పాటుగా అందంతోనూ ఆకట్టుకుంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. టేస్టీ తేజ, జేడీవి ప్రసాద్, మహేష్ విట్టా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గా మహేష్ విట్టా పాత్ర సినిమాలో ఒక సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. గోదావరి తీర ప్రాంతపు పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడి ప్రజల జీవనశైలిని ఎంతో సహజంగా చిత్రీకరించడం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఫస్టాఫ్ లో కృష్ణ, సుమతి మధ్య సాగే సున్నితమైన ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే, సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించాయి. దర్శకుడు రాసుకున్న కథ కొత్తగా ఉంది. కథనం కూడా ఆకట్టుకునేలా ఉంది. హీరో తన ప్రేమ కోసం చేసే పోరాటానికి సంబంధించి ఇంకాస్త బలమైన కారణాలు చూపిస్తే స్క్రీన్ ప్లే లో డెప్త్ మరింత పెరిగేది. ఎడిటింగ్ లో ఇంకొన్ని సీన్లకు కత్తెర వేసుంటే సినిమా ఇంకా ఆసక్తికరంగా ఉండేది. సెకండాఫ్‌లో వచ్చే రెండు గ్రామాల మధ్య గొడవ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. హాలేష్ ఎస్ సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి ప్రాంత అందాలను అద్భుతంగా చూపించాడు. సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ సమకూర్చిన సాంగ్స్ పర్వాలేదనిపించాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
అమర్దీప్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్
గోదావరి నేపథ్యం
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
కొరవడిన భావోద్వేగాలు
తీవ్రత లేని ద్వితీయార్థం

