రివ్యూ: గుణశేఖర్ ‘యుఫోరియా’ థ్రిల్ పంచిందా.?

by | Feb 6, 2026 | సినిమా రివ్యూ

విడుదల తేది: 06–02–2026
నటీనటులు: భూమిక చావ్లా (Bhumika) , సారా అర్జున్, విఘ్నేష్ గవిరెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నాజర్, రవిప్రకాష్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:

కెమెరా: ప్రవీణ్ కె పోతన్
సంగీతం: కాల భైరవ
ఎడిటర్: ప్రవీణ్ పూడి
నిర్మాణ సంస్థ: గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌
నిర్మాతలు: రాగిణి గుణ
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గుణ శేఖర్ (Gunasekhar)

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన సామాజిక కథా చిత్రం ‘యుఫోరియా’ (Euphoria) ఇటీవల ‘ధురంధర్’ చిత్రంతో హీరోయిన్‌గా ఆకట్టుకున్న సారా అర్జున్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. భూమిక, గౌతమ్‌ వాసుదేవ మీనన్‌లతోపాటు నాజర్‌, రోహిత్‌, విఘ్నేష్‌ గవిరెడ్డి, లిఖిత యలమంచిలి, అడ్డాల పృధ్వీరాజ్‌, కల్పలత, ఆదర్శ్ బాలకృష్ణ, సాయిశ్రీనికా రెడ్డి వంటి నూతన నటీనటులు ఈ సినిమాలో నటించారు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. యూనిక్ కాన్సెప్ట్ తో సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ పీరియడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే గుణశేఖర్, తన పంథాను మార్చి తీసిన ఈ ప్రయోగాత్మక చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించింది అనేది ఈ సమీక్షలో చూద్దాం.

కథ:

ఉన్నత కుటుంబంలో పుట్టిన చైత్ర (సారా అర్జున్) చదువులో టాపర్‌గా ఉంటుంది. ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఒకరోజు తన మిత్రురాలు ఒక పార్టీకి పిలవడంతో పబ్‌కు వెళ్తుంది. అయితే అక్కడ చైత్రకు వికాశ్‌ (విఘ్నేశ్‌ గవిరెడ్డి)తో పాటుగా అతని మిత్రులు పరిచాయమవుతారు. చైత్రను ఎలాగైనా లోబర్చుకోవాలి అనే కోరికతో ఉన్న వికాశ్ ఆమెను నమ్మించి తన మిత్రబృందంతో కలిసి కారులో తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ మత్తులో ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును ఛేదించేందుకు కమిషనర్‌ జయదేవ్‌ (గౌతమ్‌ మేనన్‌) రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలోనే రాజకీయ ఒత్తిళ్లు తలెత్తుతాయి. ఇలాంటి సమయంలోనే ఈ కేసులో​ నేను కూడా నేరం చేశానని వింధ్య వేములపల్లి (భూమిక) హైకోర్టుకు వెళ్లడానికి గల కారణమేంటి ? ఇంతకీ ఈ నేరంతో​ ఆమెకు ఉన్న సంబంధం ఏంటి..? ఈ కేసుని చివరకు కమిషనర్ జయదేవ్‌ ఛేదించారా ? అనేదే ఈ సినిమా మిగతా కథ.

విశ్లేషణ:

యువతరం మాదకద్రవ్యాలకు అలవాటు పడితే ఎలాంటి నష్టాలు చూడాల్సి వస్తుందో నేటి తరానికి గుణపాఠం అందించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు గుణశేఖర్. ఈ సినిమా చూస్తుంటే కొన్నేళ్లుగా సమాజంలో జరిగిన పలు సంఘటనలు మన కళ్ళ ముందు మెదులుతాయి. ఉన్నత కుటుంబాలకు చెందిన యువత చెడు అలవాట్లకు బానిసవ్వడం, వారు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నా నిరోధించలేని నిస్సహాయతలో తల్లిదండ్రులు కనిపించడం వంటి నిజజీవిత ఘటనలు ఇందులో చూపించారు. మైనర్లపై అత్యాచార ఘటనల్లి పోక్సో చట్టం ఎంత బలంగా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పడంలో గుణశేఖర్‌ విజయం సాధించాడు. దర్శకుడు ఈ సినిమా ద్వారా నేటి యువతకు చెప్పిన కథ, చెప్పాలనుకున్న సందేశం నిజంగా ఆహ్వానించదగినది. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం వెనుక గుణశేఖర్ ఎంత హోమ్ వర్క్ చేశారో మనకు కనిపిస్తుంది. కొడుకు చేసిన తప్పుకు తల్లిగా భూమిక అనుభవించిన బాధ అందరినీ కదిలిస్తుంది. అయితే ఈ సినిమాకు బలం క్లైమాక్స్ అనే చెప్పొచ్చు. సెకండాఫ్ లో సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపించినా క్లైమాక్స్ లో సారా అర్జున్ నటన ప్రేక్షకులను కంట తడిపెట్టిస్తుంది. ‘యుఫోరియా’ కథలో ప్రధాన బలం భూమికనే అని చెప్పాలి. కొడుకును సరైన దారిలో పెట్టలేని నిస్సహాయ తల్లి పాత్రలో భూమిక జీవించింది. ఇందులో పోలీస్ కమీషనర్ గా గౌతమ్ వాసుదేవ మీనన్, భూమిక భర్తగా రోహిత్ ఆకట్టుకున్నారు. వికాశ్‌ పాత్రలో విఘ్నేష్, జడ్జి పాత్రలో నాజర్ తమ పరిదిమేరకు మెప్పించారు. కాల భైరవ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ప్రవీణ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. సినిమా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఏదేమైనా నేటి యువత కచ్చితంగా చూడాల్సిన సినిమాగా ‘యుఫోరియా’ ఉంది అని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్:
భూమిక, గౌతమ్ మీనన్ నటన
క్లైమాక్స్

మైనస్‌ పాయింట్స్‌:
కొత్తదనం లేని కథ
సాగదీత సన్నివేశాలు