‘ది ప్యారడైజ్‌’ – ‘నాని’తో అంత భారీ రిస్క్‌ అవసరమా.?

by | Feb 3, 2026 | సినిమా

టాలీవుడ్‌ నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా రాబోతున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ మూవీ ది ప్యారడైజ్‌ (The Paradise). దసరా ఫేం శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మోహన్‌ బాబు, తనికెళ్ల భరణీ, కిల్‌ ఫేం రాఘవ్‌ జుయల్‌ సంపూర్ణేష్ బాబులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోనాలి కులకర్ణి ఈ చిత్రంలో నాని తల్లిగా కనిపించనుంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో సుధాకర్‌ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర వార్త నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. గతంలో నాని (Nani) నటించిన ‘దసరా’ మూవీ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 120 కోట్లకు పైగానే కలెక్షన్లు వసూలు చేసి నాని కెరీర్‌లోనే మొదటి వంద కోట్ల చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలనే ఇప్పుడు నానితో ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ముందుగా అనుకున్నదాని కంటే బడ్జెట్‌ భారీగా పెరిగిపోయిందని టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా చిత్ర పరిశ్రమలోని ఒక్కో నటుడికి ఒక్కో మార్కెట్‌ విలువ అనేది ఉంటుంది. అయితే నాని సినిమాల మార్కెట్‌ విలువ రూ. 100 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే విడుదలకు ముందే ‘ది ప్యారడైజ్‌’ సినిమాకు ఓటీటీ రైట్స్ రూపంలో నెట్ ఫ్లిక్స్ (Netflix) సంస్థ రూ. 75 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ది ప్యారడైజ్‌ సినిమాకు తొలుత బడ్జెట్ రూ.150 కోట్లుగా నిర్మాతలు అనుకోగా.. ఇప్పుడు రూ.200 కోట్లు దాటేసినట్లు టాక్ వినిపిస్తోంది. నాని ఈ సినిమా కోసం తన కెరీర్‌లోనే అత్యంత ఎక్కువగా రూ. 40 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాని ఇండస్ట్రీలో ప్రస్తుతం టైర్‌- 2 హీరోగా ఉండగా.. ఈ బడ్జెట్ చాలా ఎక్కువని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా హిట్ అయితే ఎలాంటి సమస్యలు ఉండవు. ఒకవేళ మిశ్రమ స్పందన దక్కితే మాత్రం నిర్మాతలకు కోలుకోలేని దెబ్బ అవుతుందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన దసరా సినిమా సూపర్ హిట్‌ కావడంతో వీరిద్దరిపై ఉన్న నమ్మకంతో ది ప్యారడైజ్‌ కోసం నిర్మాత సుధాకర్‌ చెరుకూరి రిస్క్ చేసి మరీ భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.