దటీజ్ రామ్‌చరణ్.. సినీ ఇండస్ట్రీకి అండగా.!

by | Jan 31, 2026 | వార్తలు

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల నుంచి సాధారణ వ్యక్తుల వరకూ అందరికీ మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీకి చెందినవారి బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan) గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. తాజాగా ఇండస్ట్రీకి చెందిన డ్యాన్సర్ల పట్ల తన గౌరవాన్ని చాటుకొని మరోసారి వార్తల్లో నిలిచారు హీరో రామ్ చరణ్. టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు (Tollywood Dancers Association) చెందిన సుమారు 500 మంది డ్యాన్సర్లతో పాటుగా వారి కుటుంబాలకు ఉచిత ఆరోగ్య భీమా కల్పించేందుకు ముందుకొచ్చారు. గతంలో తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీకి తాజాగా ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.

ఈ ఆరోగ్య భీమా పథకం ద్వారా టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు చెందిన ప్రతీ డ్యాన్సర్ తో పాటుగా వారి కుటుంబ సభ్యులకు పూర్తి ఆరోగ్య భీమా (Health Insurance) అందనుంది. ఈ గొప్ప కార్యక్రమానికి ముందుకొచ్చిన రామ్ చరణ్ (Ram Charan) దాదాపుగా యాభై లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం. ఇదే కాకుండా త్వరలోనే సినీ కార్మికుల బాగోగుల కోసం రామ్ చరణ్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ‘పెద్ది’ (Peddi) సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నప్పటికీ తమ ఆరోగ్య భరోసా కోసం రామ్ చరణ్ ముందుకు రావడంపై టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు