‘RT77’ మూవీ టైటిల్ – ‘ఇరుముడి’ ఎత్తుకున్న రవితేజ

by | Jan 26, 2026 | సినిమా

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) , క్లాసిక్ డైరెక్టర్ శివ నిర్వాణ (Siva Nirvana) కాంబినేషన్‌లో ఓ కొత్త చిత్రం మొదలవనున్న సంగతి తెలిసిందే. RT77 (RT77) వర్కింగ్ టైటిల్ తో రానున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. గతంలో నిన్ను కోరి, మజిలీ, ఖుషి వంటి ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ ఈసారి ఓ ఫుల్ లెంగ్త్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇది ఒక పవర్‌ఫుల్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోంది. తన కూతురిని కాపాడుకోవడం కోసం ఒక తండ్రి చేసే పోరాటం, చుట్టూ ఈ కథ నడవనుంది. అయితే ఈ సినిమా టైటిల్ ఏంటి అని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొని ఉండ‌గా, తాజాగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్.

ఈ సినిమాకి ‘ఇరుముడి’ (Irumudi) టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం. మండల దీక్ష పూర్తయిన తర్వాత శబరిమలలో కొలువైన అయ్యప్ప దర్శనానికి ఇరుముడి కట్టుకొని బయల్దేరుతారు స్వాములు. ఆధ్యాత్మికంగా భక్తులకు ఎంతో విశిష్టమైన పేరుతో ఈ సినిమా టైటిల్ ప్రకటించగానే అందరిలోనూ ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రవితేజ (Ravi Teja) అయ్యప్ప మాల ధరించి, చిన్న పాపను ఎత్తుకొని భక్తి పారవశ్యంతో నర్తిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) నటించనుండగా.. జీ.వీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరోవైవు రవితేజ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది.