అనిల్ రావిపూడికి మెగాస్టార్ అదిరే గిఫ్ట్‌

by | Jan 25, 2026 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మనశంకర వరప్రసాద్‌గారు’. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ (Victory Venkatesh) కీలక పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి మెగా స్టార్ కెరీర్‌లోనే టాప్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన నేపథ్యంలో హీరో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి అద్భుతమైన బహుమతిని అందించారు. మన శంకరవరప్రసాద్ గారు సాధించిన విజయానికి సంతోషించిన చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడికి లగ్జరీ కారుని బహుమతిగా ఇచ్చారు.

ప్ర‌ముఖ కార్ల కంపెనీ ల్యాండ్ రోవ‌ర్‌కి చెందిన‌ రేంజ్ రోవ‌ర్ ల‌గ్జ‌రీ కారుని అనిల్ రావిపూడికి కానుకగా ఇచ్చాడు. కాగా, ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదిక‌గా అభిమానులతో పంచుకుంది. ఇక తాను దైవంగా అభిమానించే హీరో నుంచి ఊహించ‌ని విధంగా అందిన బ‌హుమ‌తితో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఒకింత భావోద్వేగానికి గుర‌య్యారు. ఇక దర్శకుడిగా అనిల్ రావిపూడి తాను తెరక్కించిన తొమ్మిది సినిమాలతోనూ సూపర్ హిట్స్ సాధించారు. పటాస్‌తో కెరీర్ మొదలెట్టిన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్‌2,ఎఫ్‌3 చిత్రాలతో మంచి విజయాల్ని అందుకున్నారు. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్‌ తన ఖాతాలో వేసుకున్నారు. గత ఏడాది విక్టరీ వెంకటేష్‌తో తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం భారీ విజయాన్ని అందుకోగా, అదే ఊపుతో ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో రూపొందించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు.