మళ్ళీ తెరపైకి ప్రభాస్ – సుకుమార్ కాంబో.!

by | Jan 23, 2026 | సినిమా

‘పుష్ప 2’ (Pushpa) సినిమాతో ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ కొట్టిన అగ్ర దర్శకుడు సుకుమార్ ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉన్నాడు. ‘పెద్ది’ (Peddi) షూటింగ్ పూర్తయిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తో సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ‍స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని రూపొందించనుంది. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ చిత్రాల తర్వాత దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించే చిత్రమిదే కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై పాన్‌ ఇండియా స్థాయిలో హైప్‌ క్రియేట్‌ అయింది. అయితే రామ్ చరణ్ తో సినిమా ముగిశాక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమా కథను ప్రభాస్ కు డైరెక్టర్ సుకుమార్ (Sukumar) వినిపించగా.. ప్రభాస్ ఓకే చెప్పినట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌ పనుల్లో సుకుమార్‌ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2028లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ది రాజా సాబ్’ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రభాస్ ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’తో పాటుగా సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ (Spirit) లో కూడా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటుగా ప్రభాస్ ‘కల్కి 2’ చిత్రీకరణలో ఫిబ్రవరి నుంచి పాల్గొననున్నారు.