మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మనశంకర వరప్రసాద్‌గారు’. (Mana Shankara Vara Prasad Garu) నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ (Venkatesh) కీలక పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ముగిసేనాటికి రూ.310 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో చిరంజీవి తన పిల్లలతో కలిసి స్కూల్‌లో కనిపించే కొన్ని సీన్స్ లో వచ్చే ‘ఫ్లై హై’ అనే సాంగ్‌ను పాడింది చిరు చెల్లెలు మాధవి కుమార్తె నైరా అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలియజేశాడు. ఇందుకు సంబంధించి మేకర్స్ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు.
ఇందులో చిరు మేనకోడలు ఇలా మాట్లాడారు ‘హాయ్ నా పేరు నైరా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలోని ‘ఫ్లై హై’ పాటను నేను పాడాను. సింగపూర్‌లోని లసలా కాలేజ్ లో పాప్ మ్యూజిక్ స్టూడెంట్‌గా ఉన్నాను. ఈ సినిమాతోనే నేను సింగర్‌గా కెరీర్ మొదలుపెడుతున్నాను’ అని చెప్పింది. అయితే తాజాగా చిరంజీవి తన మేనకోడలిపై ప్రశంసల వర్షం కురిపించారు. నా చిట్టి మేనకోడలు నైరా ఫ్లై.. హై సాంగ్ పాడటం చూసి నా హృదయం ఆనందంతో పులకించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే నువ్వు ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

