‘ఎల్లమ్మ’ కోసం వేణు-దేవీశ్రీ మాస్టర్ ప్లాన్!

by | Jan 21, 2026 | సినిమా

బ‌ల‌గం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు వేణు ‘ఎల్ల‌మ్మ’ (Yellamma) అనే సినిమాతో రాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు (Dil Raju) నిర్మించ‌బోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ను (DSP) హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందుకు సంబంధించి సంక్రాంతి రోజున చిత్ర యూనిట్ ఓ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. ఇందులో దేవీ ‘ప‌ర్షి’ పాత్ర‌లో జులపాల జుట్టుతో, రగ్గడ్‌గా లుక్‌లో కనిపించారు. అలాగే దేవిశ్రీ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గ్లింప్స్‌ని మరోస్థాయికి తీసుకెళ్లింది.

దైవ శక్తి, స్థానిక సంప్రదాయాలు మేళవింపుగా ‘ఎల్లమ్మ’ తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాతో దర్శకుడు వేణు మరో హిట్‌ను ఖాతాలో వేసుకునేందుకు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌కు (Devi Sri Prasad – DSP) హీరోగా తొలి చిత్రం కావడంతో స్క్రిప్ట్ మీద స్పెషల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దర్శకుడు వేణు, హీరో దేవిశ్రీప్రసాద్ ‘ఎల్లమ్మ’ (Yellamma) మూవీ స్క్రిప్ట్ మీద 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు వేణు (Venu) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.