‘నారీ నారీ నడుమ మురారి’ నుంచి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్

by | Jan 19, 2026 | సినిమా

టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) నటించిన ‘నారి నారి నడుమ మురారి’ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోందన్న సంగతి తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్రకారం, కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఇవేన్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీరో శర్వానంద్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కామెడీ, ఎమోషన్స్ తో రూపొందిన ఈ చిత్రం రోజురోజుకీ థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా నుంచి ‘పండుగ మళ్ళీ మొదలైంది’ అంటూ చిత్ర బృందం మరో అదిరిపోయే అప్ డేట్ ను అందించారు.

‘నారి నారి నడుమ మురారి’ (Nari Nari Naduma Murari) చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆదరణ లభిస్తున్న కారణంతో పాటుగా అభిమానుల నుంచి వస్తున్న డిమాండ్‌ నేపథ్యంలో మరిన్ని ఎక్కువ థియేటర్లతో మీ ముందుకు వస్తున్నాం అంటూ ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలోనే ఓ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రానికి అమెరికాలో కూడా అభిమానులు పట్టం కడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా 500k డాలర్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం 1 మిలియన్ మార్క్‌ను టచ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో సంయుక్తా మేనన్, సాక్షి వైద్య కథానాయికలుగా నటించగా, సంపత్ రాజ్, నరేశ్ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు.