‘వరప్రసాద్‌గారి’ బాక్సాఫీస్ ఊచకోత.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?

by | Jan 19, 2026 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మనశంకర వరప్రసాద్‌గారు'(Mana Shankara Vara Prasad Garu). నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ కీలక పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి స్టోరీకి జతగా చిరంజీవి గ్రేస్, వెంకటేష్ (Venkatesh) స్పెషల్ ఎంట్రీ తోడవడంతో థియేటర్లు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి. ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే.. రిలీజైన తొలి మొదటి రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసిన ‘మనశంకర వరప్రసాద్‌గారు’ ఇప్పుడు మొదటి వారం ముగిసేనాటికి రూ.292 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే చిరంజీవి (Chiranjeevi), వెంకటేష్ కలిసున్న సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.

సోమవారం వసూళ్లు కలుపుకొని ఈ చిత్రం రూ.300 కోట్ల మార్క్‌ను కూడా టచ్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ట్రెండ్ చూస్తుంటే మరికొన్ని రోజులు ‘మనశంకర వరప్రసాద్‌గారు’ సినిమా ఊచకోత ఇలానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లోను ‘మన శంకరవరప్రసాద్’ గారుకి అద్భుత స్పందన లభిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా 3 మిలియన్ల మైలురాయిని అధిగమించింది. దీంతో చిరంజీవి కెరీర్‌లోనే నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది. కాగా, ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా.. షైన్ స్క్రీన్స్ (Shine Screens) పతాకంపై సాహు గారపాటితో కలిసి సుస్మిత కొణిదెల (Sushmitha Konidela) సంయుక్తంగా నిర్మించారు.