రేటింగ్: 3/5
విడుదల తేది: 14–01–2026
నటీనటులు: శర్వానంద్,
సంయుక్త మీనన్, సాక్షి వైద్య , శ్రీవిష్ణు, నరేష్, సత్య, సునీల్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సుదర్శన్, సంపత్‌రాజ్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్, యువరాజ్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
కథ: భాను భోగవరపు
మాటలు: నందు సవిరిగాన
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు
గత కొన్నేళ్లుగా సరైన హిట్ అనేదే లేక సతమతమవుతున్న టాలీవుడ్ యువ హీరో శర్వానంద్.. చాలా కాలం తర్వాత ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో ‘సామజవరగమన’ వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో శర్వానంద్ కు జోడీగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. టాలీవుడ్ యువ కథానాయకుడు శ్రీవిష్ణు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నరేష్, సునీల్, వెన్నెల కిషోర్, సత్య, సుదర్శన్, గెటప్ శ్రీను ముఖ్య పాత్రల్లో నటించగా.. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. భాను భోగవరపు ఈ సినిమాకు కథను ఇవ్వగా, నందు సావిరిగన డైలాగ్స్ అందించారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక శర్వానంద్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ‘నారీ నారీ నడుమ మురారి’ అందరి అంచనాలను అందుకున్నాడా? ఈ సినిమా సంక్రాంతి వినోదం పంచిందా?శర్వానంద్ హిట్టు కొట్టాడా?వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఓ సంస్థలో గౌతమ్ (శర్వానంద్) ఆర్కిటెక్ట్ గా ఉద్యోగం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అదే సంస్థలో సివిల్ ఇంజినీర్ గా పని చేస్తున్న నిత్య (సాక్షి వైద్య)తో పీకల్లోతు ప్రేమలో పడతాడు. దాంతో వీరిద్దరూ తమ కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమవుతారు. ఆ తరుణంలోనే అదే కంపెనీలో టీమ్ లీడర్‌గా గౌతమ్ మాజీ ప్రేయసి దియా (సంయుక్త మీనన్) అడుగుపెడుతుంది. దాంతో గౌతమ్, నిత్య పెళ్లికి ఊహించని అడ్డంకులు ఎదురవుతాయి. అసలు గౌతమ్, దియాలు ఎందుకు విడిపోయారు ? దియా తిరిగి వచ్చాక గౌతమ్ పరిస్థితి ఎలా మారింది ? చివరికి గౌతమ్ ఎవరికి దగ్గరయ్యాడు? గౌతమ్, దియ, నిత్య ఈ ముగ్గురి మధ్య ఉన్న సంబంధం ఏంటి ? అనేదే ఈ సినిమా మిగతా కథ.
విశ్లేషణ:
వినోదంతో మొదలై భావోద్వేగాలతో ముగిసే కథ ఇది. అయితే ఇలాంటి స్టోరీలు గతంలోనూ చాలానే వచ్చాయి. ఈ మధ్య కాలంలో పాత కథలకు కొత్త రంగులద్ది చాలా సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఈ సినిమా విషయానికొస్తే.. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే గౌతమ్ కథ ఇది. ఇలాంటి ఇద్దరు ప్రియురాల్ల ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథలు హెవీ డ్రామా ఎమోషన్ తో ఉంటాయి. కానీ డైరెక్టర్ రామ్ అబ్బరాజు కామెడీకి పెద్దపీట వేస్తూ ఈ కథని నడపడం కొత్తదనం తీసుకొచ్చింది. భాను భోగవరపు స్టోరీ, నందు సావిరిగన డైలాగ్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి.
హీరో శర్వానంద్ ఎప్పటిలాగే తనదైన చురుకుతనంతో అలరించాడు. గౌతమ్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. ఇక శర్వానంద్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చక్కని వినోదాన్ని పంచాడు. సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్‌లో కూడా బాగా నటించాడు. సాక్షి వైద్య, సంయుక్త మీనన్ పాత్రలను దర్శకుడు బాగానే డిజైన్ చేశాడు వీరిద్దరి సీన్స్ చాలా బలంగా ఉండటంతో ఆ క్యారక్టర్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రత్యేకించి సాక్షి వైద్య ఆ పాత్రకు రైట్ ఛాయిస్ అనిపిస్తుంది. సత్య, వెన్నెల కిశోర్, సునీల్ తమదైన శైలిలో వినోదాన్ని అందించారు. ముఖ్యంగా హీరో తండ్రి పాత్రలో నటించిన సీనియర్ నటుడు నరేష్ మీద తీసిన సీన్స్ మరో లెవెల్ లో ఉన్నాయి. తన కంటే వయసులో చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తిగా ఆయన పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, జ్ఞానశేఖర్, యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర మేకింగ్ లో ఎక్కడా రాజీ పడలేదు. ఆ విషయం తెర మీద సన్నివేశాలలో కనిపిస్తోంది. మొత్తంగా మేకర్స్ చాలా రోజుల తర్వాత శర్వానంద్ అభిమానులకు అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చారు.
ప్లస్ పాయింట్స్:
శర్వానంద్ నటన
నరేశ్ పండించిన హాస్యం
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
కొత్తదనం లేని కథనం
క్లైమాక్స్

