VT 15: వరుణ్ తేజ్ కొత్త సినిమా షురూ..

by | Mar 24, 2025 | సినిమా

తెలుగు సినీ పరిశ్రమలో భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. ఇటీవలే కరుణకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన మట్కా మూవీకి బాక్సాఫీస్‌ వద్ద నిరాశే ఎదురైంది. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్‌ తేజ్ మేర్లపాక గాంధీతో త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ చేయ‌బోతున్నారన్న సంగతి తెలిసిందే. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్‌ మినీ కథ లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మేర్లపాక. ఈ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో కథానాయికగా రితికా నాయక్‌ నటించనుంది. అయితే ఈ చిత్రం సోమవారం హైద్రాబాద్ లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ వేడుకకు చిత్రబృందంతో పాటుగా వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి, మెగా డాటర్ నిహారిక , దర్శకుడు క్రిష్ పాల్గొని చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

వరుణ్ తేజ్ కెరీర్ లో 15వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈరోజు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కి వెళ్లనుంది. ఇండో-కొరియన్‌ హార్రర్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. మేర్లపాక గాంధీ ఇందులో వరుణ్‌తేజ్‌ కోసం సాలిడ్ స్క్రిప్ట్‌ రెడీ చేశారని, ఈ మూవీలో యూనిక్ క్యారెక్టర్‌లో వరుణ్‌ తేజ్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో అగ్ర భాగం కొరియా, వియాత్నంలో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ అనుకుంటున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ తో పాటుగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యాన‌ర్‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి.