రాజాసాబ్ ఫ్లాప్ తరవాత, మెగా హీరోతో మారుతి కొత్త మూవీ!

by | Jan 22, 2026 | సినిమా

టాలీవుడ్‌లో దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ మారుతి (Maruthi). ఈ సంక్రాంతికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ఆయన తెరకెక్కించిన ‘ది రాజాసాబ్’తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. హార్రర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తరువాత ప్రభాస్‌కి వరుసగా సినిమాలు చేస్తుండగా.. డైరెక్టర్ మారుతి తర్వాతి సినిమా ఏమిటన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మొదట్లో మారుతీ తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడనే వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమా పట్టాలెక్కలేదని తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు మారుతి తన తదుపరి సినిమాను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మారుతి, వరుణ్ తేజ్ (Varun Tej) ను కలిసి స్టోరీ లైన్ చెప్పగా అది నచ్చి మెగా హీరో వెంటనే ఒకే అన్నాడట. పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్రను సరికొత్తగా రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీతో ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanaka Raju) అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వేసవి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా పూర్తయ్యాక మారుతితో సినిమా చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.