ఎన్టీఆర్‌ – నీల్ సినిమా.. షూటింగ్‌ పూర్తి కాకుండానే భారీ డీల్‌!

by | Mar 31, 2025 | సినిమా

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్‌, స‌లార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగెన్’ (Dragon) అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్​ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు భారీ రేంజ్‌లో బిజినెస్‌ జరుగుతుందట. యూఎస్ లో ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు కళ్ళు చెదిరే ధరకు అమ్ముడయ్యాయట. ముఖ్యంగా నార్త్ అమెరికాకి చెందిన థియేట్రికల్ డీల్ భారీ చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేసే ప్రత్యంగిరా సంస్థ ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి దక్కించుకోని అక్కడ విడుదల చేయనుంది. అయితే షూటింగ్ పూర్తవకముందే ఈ రేంజ్‌లో ఎన్టీఆర్ – నీల్ సినిమాకు బిజినెస్‌ జరగడం విశేషం అనే చెప్పాలి.

ఇదిలాఉంటే.. ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో హీరో ఎన్టీఆర్ (NTR) ఇంకా అడుగుపెట్టని సంగతి తెలిసిందే. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంకకు వెళ్లనుంది. అక్కడి లొకేషన్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓ భారీ రిస్కీ ఫైట్ ను కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమయ్యే శ్రీలంక షెడ్యూల్​లో హీరో ఎన్టీఆర్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ (NTR) ​పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అప్డేట్ ను మేకర్స్ అందించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.