‘హను-మాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా (Teja Sajja) . ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. ‘సూపర్ యోధ’ ఉపశీర్షిక. ఇక మిరాయ్ అంటే ఫ్యూచర్ అని అర్థం. ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ‘మిరాయ్’ మూవీని 8 భాషల్లో ఆగస్టు 1, 2025న 2డి, 3డి వెర్షన్‌లలో విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా మరింత పెంచేసింది. అయితే ఇటీవలి కాలంలో స్టార్ హీరోల సినిమాలే విడుదలకు ముందు అంచనాలు పెంచడంలో విఫలమతున్నాయి. కానీ తేజ సజ్జ (Teja Sajja) మాత్రం ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతున్నాడు.
ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలకు చాలా సమయం ఉన్నప్పటికీ మిరాయ్పై ఇప్పటికే భారీగా హైప్ క్రియేట్ అయింది. ఈ తరుణంలోనే ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో ఇప్పటికే 25,000 మందికి పైగా ‘మిరాయ్’ చిత్రాన్ని లైక్ చేయడం విశేషం. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంత హైప్ క్రియేట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే హీరో తేజ ఈ మిరాయ్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ఏకంగా రూ.30 కోట్లకు దక్కించుకోవడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమాలో మంచు మనోజ్ నెగిటివ్ పాత్రలో కనిపిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీతో పాటు డైలాగ్ రైటర్ మణిబాబు కరణంతో కలిసి స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. గౌరహరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సినిమాలో తేజ సజ్జాకు జోడిగా రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, శ్రియా శరన్, జయరాం, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో నటించనున్నారు.

