మెగా ఫ్యాన్స్‌కు బిగ్ ట్విస్ట్.. ‘వీరమల్లు’ కోసం ‘విశ్వంభర’ త్యాగం

by | Mar 11, 2025 | సినిమా

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, హరిహరవీరమల్లు మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో భాగంగా పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాల్ని రాజస్థాన్ లో షూట్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ మూవీ వాయిదా వేయనున్నారని సమాచారం.

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 28న కాకుండా మే 9న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అయితే ఇప్పటికే ఆ తేదీలో విడుదల కానున్న చిరంజీవి ‘విశ్వంభర'(Viswambhara) చిత్రానికి ఇది ఇబ్బందిగా మారింది. నిజానికి ‘విశ్వంభర’ మూవీ సంక్రాంతికి విడుదలవాల్సి ఉండగా.. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ కోసం వాయిదా వేశారు. కానీ వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తవకపోవడంతో మే 9కి వాయిదా వేశారు. వాస్తవానికి మే 9వ తేదీ చిరంజీవికి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి (Chiranjeevi) ఆల్ టైం హిట్స్ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘గ్యాంగ్ లీడర్’ వంటి సినిమాలు మే 9న విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కోసం చిరంజీవి తన ‘విశ్వంభర’ చిత్రాన్ని మరోసారి వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.