‘వారణాసి’ కోసం మహేష్ కష్టాలు మాములుగా లేవు.!

by | Feb 12, 2026 | సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా అగ్ర దర్శకుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటిస్తుండగా.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్ పాత్ర పోషిస్తున్నారు. కేఎల్‌ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా సినిమాను సుమారు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండ‌గా, క‌థ విజయేంద్ర ప్రసాద్ అందించారు. తాజా సమాచారం ప్రకారం వారణాసి (Varanasi) మూవీకి సంబంధించి ఇప్పటికే దాదాపు యాబై శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ మూవీ తదుపరి షెడ్యూల్‌ను జార్జియాలో నిర్వహించేందుకు రాజమౌళి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. నిజానికి ఏడాదికి ఒక సినిమా చేసే మహేష్ బాబు (Mahesh Babu) , ఈ సినిమా కోసం తన కెరీర్ లోనే అత్యధిక సమయాన్ని కేటాయించారు. ఒక అగ్ర హీరో తన కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు ఇంత సమయం ఒకే సినిమాకు ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. కేవలం ఈ మూవీలో మేకోవర్ కోసమే మహేష్ ఏడాది పాటు కష్టపడ్డారు. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా ఆరు నెలల పాటుగా కఠినమైన కలరిపయట్టు అనే యుద్ధ విద్యను నేర్చుకున్నారు. దాంతో పాటుగా మహేష్ ఎంతో కష్టపడి తన రన్నింగ్ స్టైల్ ను కూడా ఈ సినిమా కోసం మార్చుకున్నారు. ముఖ్యంగా మహేష్ చేసిన భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయి. కేవలం సినిమాపై ఉన్న ప్యాషన్ తో మహేష్ ఇన్ని కష్టాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక హాలీవుడ్ రేంజులో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలయ్యాక, పాన్‌ ఇండియా రికార్డులు తిరగరాయబడటం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 07, 2027న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటించారు.