దిగ్గజ దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్‌బాబుల (Mahesh Babu) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటిస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. మహేశ్ బాబును అత్యంత శక్తివంతమైన పాత్రలో ఆవిష్కరిస్తూ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు రాజమౌళి (Rajamouli) ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో ముగిసింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ సెట్ ఇదే అంటూ కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు(Mahesh Babu) , ప్రియాంక చోప్రాతో పాటు ముఖ్య తారాగణంపై గత కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ పూర్తవడంతో రెండో షెడ్యూల్ కోసం చిత్రబృందం ఆఫ్రికాకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆఫ్రికాకి కాకుండా వెళ్లేందుకు ముందు ఒడిశాలోని అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరపనున్నట్లు సమాచారం. ఒడిశాలోని కోరాపుట్ అటవీ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇందులో కీలక పాత్ర పోషించబోతున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓడిశాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి అడవుల్లో రెండో షెడ్యూల్ మొదలవుతుందని, అక్కడ మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ మీద కొన్ని కీలక యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించబోతున్నారని సమాచారం. కాగా, అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు ఇతర భాషల నటులు కనిపించనున్నారు. అన్ని భాషల్లోనూ ఈ సినిమాను రీమేక్ చేయనున్నారు.

