బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ దర్శకుడుగా మారనున్నారన్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా తెరకెక్కిన ‘క్రిష్’ సిరీస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. క్రిష్ ఫ్రాంచైజీలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. ‘కోయి మిల్ గయా’, ‘క్రిష్’, ‘క్రిష్ 3’ చిత్రాలు ఇప్పటికే విడుదలై భారీ విజయాలని సాధించగా.. నాలుగో సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు ఇటీవలే వెల్లడించాడు. అయితే మొదటిసారి దర్శకుడుగా మెగాఫోన్ పట్టబోతున్న సందర్భంగా హృతిక్ రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ నేపథ్యంలో హృతిక్ మాట్లాడుతూ.. “చిన్న నాటి నుంచి డైరెక్టర్ కావాలని కలలు కంటూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా భయంగా ఉంది. చిన్నప్పటి నుంచి సినీ రంగానికి దగ్గరగా పెరిగినప్పటికీ మళ్లీ కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు అనిపిస్తోంది. నటుడిగా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. కానీ దర్శకుడుగా ఇది నాకు కొత్త ప్రయాణం. ఎన్నో కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు నటుడిగానే ఉండకుండా దర్శకుడుగా ఎందుకు మారాను అని కూడా అనిపించవచ్చు. అయినా, నేనేమీ పారిపోవాలి అనుకోవట్లేదు. ఈ సవాళ్లన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. మీ అందరి ప్రేమ నాతో ఎప్పటికీ ఉంటుంది.” అని హృతిక్ రోషన్ చెప్పుకొచ్చారు.
కాగా, హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ హీరో చిత్రం క్రిష్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రిష్ (Krish) ఫ్రాంచైజీలో మొదటి మూడు భాగాలుగా హృతిక్ రోషన్ (Hrithik Roshan) తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించగా.. ఇప్పుడు తెరకెక్కనున్న క్రిష్ 4తో హృతిక్ రోషన్ దర్శకుడిగా మారబోతున్నాడు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా రూ.700 కోట్ల భారీ బడ్జెట్తో హాలీవుడ్ స్థాయిలో నిర్మించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక హృతిక్ రోషన్ సినిమాల విషయనికొస్తే.. 2019లో చేసిన ‘వార్'(WAR) మూవీ సూపర్ హిట్ గా నిలువగా తర్వాత వచ్చిన ‘విక్రమ్ వేదా’, ‘ఫైటర్’ సినిమాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత క్రిష్ 4ని హృతిక్ రోషన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

