‘ఘరానా మొగుడు’ – తొలి ఇండస్ట్రీ  హిట్ కు 33 సంవత్సరాలు

by | Apr 9, 2025 | ప్రగడ టీవీ

మెగాస్టార్ చిరంజీవి, నగ్మా, వాణి విశ్వనాధ్ నటించిన ఘరానా మొగుడు చిత్రం విడుదలై నేటికి 33 సంవత్సరాలు అయ్యింది.  1992 ఏప్రిల్ 9 న విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇంకా ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, రమప్రభ, బ్రహ్మానందం, డిస్కో శాంతి, శరత్ సక్సేనా తదితరులు నటించారు

దేవి ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై దేవి వరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కె రాఘవేంద్ర రావు గారు దర్శకులు. కె రాఘవేంద్ర రావు, చిరంజీవి కాంబినేషన్ లో వరసగా ఇది మూడవ హిట్.  జగదేక వీరుడు అతిలోక సుందరి, రౌడీ అల్లుడు చిత్రాల తరవాత వచ్చిన ఈ ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్

 ఏం ఏం కీరవాణి గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంది అని చెప్పవచ్చు.  ఈ చిత్రంలోని బంగారు కోడిపెట్ట పాట అప్పట్లో ఒక పెద్ద సంచలనం.  ఈ పాటను రామ్ చరణ్ హీరో గా వచ్చిన మగధీరలో రీమిక్స్ చేశారు.

10 కోట్ల వసూళ్లు దాటిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది.  అప్పటి టికెట్ రేట్ల తోనే 10 కోట్ల షేర్ వసూలు చేసిందంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అనేది. దక్షిణ భారత దేశంలో 10 కోట్ల షేర్ వసూలు చేసిన మొదటి చిత్రం ఘరానా మొగుడు

1986 లో, డాక్టర్ రాజ్ కుమార్ హీరో గా  వచ్చిన కన్నడ చిత్రం ‘అనురాగ ఆరలితు’  ఆధారంగా ఈ ఘరానా మొగుడు ని తెరకెక్కించారు దర్శ కేంద్రుడు రాఘవేంద్ర రావు

ఈ సినిమా కధ కూడా ఏమంత గొప్ప కధ కాదు. అయితే చిరంజీవి తన స్టైల్, డాన్స్, ఫైట్స్ తో ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ చేశారు

ఈ చిత్ర కధ ఏంటంటే, తల్లిని సంతోష పెట్టడానికి సొంత ఊరు వచ్చి ఉద్యోగాన్వేషణలో ఉన్న రాజు (చిరంజీవి), ఉమాదేవి ఇండస్ట్రీస్ చైర్మన్ బాపినీడు గారిని ఒక ప్రమాదం నుండి కాపాడతాడు. ఈ క్రమంలో ఉమాదేవి ఇండస్ట్రీ లో రాజుకు కార్మికుడిగా ఉద్యోగం వస్తుంది. అయితే ఈ కంపెనీ కి ఎం డి బాపినీడు గారి కూతురు ఉమా దేవి.

రోజు రోజు కి కార్మికులలో రాజు కి  ఆదరణ పెరిగిపోతోన్న ఈ తరుణంలోనే , రాజు కార్మికుల యూనియన్ లీడర్ గా గెలుస్తాడు.  ఇదంతా తట్టుకోలేక, రాజు ని ఎలాగైనా తన గుప్పిట్లో బందించాలని, రాజు ని సాధించడానికి ఉమాదేవి పెళ్లి చేసుకుంటుంది.  ఉమాదేవి ఎత్తులకు, పై ఎత్తులు వేస్తూ, ఉమా దేవి గర్వాన్ని అణచి లీడర్ రాజు పెళ్ళాం అనేలా బుద్ది  చెపుతాడు రాజు. 

ఈ సినిమలో పాటలన్నీ సూపర్ హిట్. ఫైట్స్, కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బ్లాక్ బస్టర్.

బంగారు కోడిపెట్ట లో చిరంజీవి స్టెప్స్, వాన పాటలో అభినయం స్టెప్స్, చిరంజీవి, నగ్మా లు మందు తాగి ఇంట్లో పాడిన ఏంది బె ఎట్టాగ ఉంది ఒళ్ళు పాటలు ఈ రోజు కు ఎవర్ గ్రీన్ హిట్స్

అప్పట్లో చిరంజీవి ప్రతి సినిమాలో కొన్ని ప్రత్యేకమైన డైలాగులు ఉండేవి.  ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి ‘కొంచెం పేస్ టర్నింగ్ ఇచ్చుకో’ అనే డైలాగు యెక్కువగా వాడతాడు. ఈ సినిమాలో చిరంజీవి నమస్కారం పెట్టె స్టైల్ కూడా ఎంతో పాపులర్ అయ్యింది

చిరంజీవి 150 కి పైగా సినిమాలు చేసినా వ్యక్తిగతంగా చిరంజీవి కి నచ్చిన టాప్ టెన్ సినిమాలలో ఖచ్చితంగా ఘరానా మొగుడు సినిమా ఉంటుంది అనడంలో సందేహం అక్కర్లేదు. 

ఈ రోజు కి ఈ సినిమా జెమినీ టీవీ, జెమినీ మూవీస్ చానెల్స్ లో వస్తే, ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు.   ఈ సినిమాకు టీవీ లో ఇప్పటికి మంచి రేటింగ్స్ వస్తాయి.