బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్ కథానాయకుడుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘ఛావా’. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో శంభాజీ మహరాజ్‌గా విక్కీ, ఆయన సతీమణి యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
ఇటీవలే రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా 9వ రోజైన రెండో శనివారం దేశవ్యాప్తంగా కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. 8వ రోజైన శుక్రవారం రూ. 24 కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టిన ‘ఛావా’ 9వ రోజు ఏకంగా రూ. 44 కోట్లకి కలెక్షన్లు వసూలు చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ హిందీలో రెండో శనివారం రూ. 46.50 కోట్లు వసూలు చేయగా.. రూ. 44 కోట్ల వసూళ్లతో ‘ఛావా’ రెండో స్థానంలో నిలిచింది. మొత్తంగా ఇప్పటివరకు రూ. 293 కోట్ల పైగా నెట్ వసూళ్లు ఒక్క హిందీ వెర్షన్ లోనే సాధించడం విశేషం. 10వ రోజైన ఆదివారం ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దింతో ఈ వీకెండ్ ముగిసే నాటికి సునాయాసంగా రూ. 350 కోట్ల నెట్ వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. కాగా శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మొఘల్ రాకుమారి పాత్రలో డయానా పింటీ, ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించగా.. ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించారు.

